మరోసారి మానవత్వం చాటుకున్న ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

శుక్రవారం ఉదయం ఓ కేసు విషయమై చిన్నఅడిచర్లపల్లి గ్రామానికి వెళుతుండగా హార్టికల్చర్ కార్యాలయం వద్ద రోడ్డుమీద వృద్ధుడు పడి ఉన్న విషయాన్ని గమనించారు.

వెంటనే తన వాహనాన్ని ఆపి సదరు వృద్ధుడిని తనవాహనంలో తీసుకెళ్లి దగ్గరుండి ప్రధమ చికిత్సను చేయించారు.అనంతరం వృద్ధుడి వివరాలను తెలుసుకుని, పెండ్లిపాకల గ్రామానికి చెందిన ఆచారిగా (65) గుర్తించి,వృద్ధుడికి కుటుంబ సభ్యులు ఎవరూ లేరనే తెలుసుకొని,అతడికి ఆహార పదార్థాలు,పండ్లు ఇప్పించి,పోలీస్ వాహనంలో పెండ్లిపాకల గ్రామంలోని బంధువుల ఇంటికి చేర్చారు.

గతంలో హైదరాబాదు-నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టి,ప్రమాద బారినపడ్డ బాధితులను పోలీసు వాహనంలో దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి సరైన సమయంలో చేర్చి ప్రాణాలు నిలబెట్టారు.ఇటీవల మండల పరిధిలోని ఆంగోతు తండాకు చెందిన ఓ మహిళ ఉరేసుకున్న సందర్భంగా పోలీసు వాహనంలో సదరు మహిళను సరైన సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాలను సైతం కాపాడి,జిల్లా ఎస్పీ అభినందనలు కూడా అందుకున్నారు.

అంతేకాకుండా ఇంకా చిన్నాచితక సహాయ,సహకారాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ కొండంత మనసున్న కొండమల్లేపల్లి ఎస్ఐగా మండల ప్రజల ప్రసంశలు అందుకుంటున్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసుల్లో మనుషులకు మంచి చేసే మనసున్న పోలీసులు ఉంటారని ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి లాంటి వారిని చూస్తే అర్థమవుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
ప్రజల సమస్యలే నా ఎజెండా : దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్

Latest Nalgonda News