అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరుగుతున్నాయి.అన్నింటికి మించి అధ్యక్ష అభ్యర్ధుల భద్రత విషయం ఈసారి చర్చనీయాంశమైంది.
రిపబ్లికన్ అభ్యర్ధి , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఇప్పటికే పెన్సిల్వేనియాలోని ఎన్నికల ర్యాలీలో దుండగుడి భారీ నుంచి తప్పించుకున్నాడు.కొద్దిరోజుల క్రితం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా.
ఓ అగంతకుడు తుపాకీతో లోపలికి ప్రవేశించాడు.అతనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై కాల్పులు జరిపారు.
దీంతో అగంతకుడు కారులో పారిపోయేందుకు యత్నించగా.పోలీసులు ఛేజ్ చేసి అతనిని పట్టుకున్నారు.
నిందితుడిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.ట్రంప్‌ను హత్య చేసేందుకే నిందితుడు వచ్చినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) నిర్ధారించింది.
తాజాగా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris ) ప్రచార కార్యాలయంపై కాల్పుల వ్యవహారం అమెరికాలో కలకలం రేపింది.మంగళవారం అర్ధరాత్రి దాటాక టెంపేలోని సదరన్ అవెన్యూ ప్రీస్ట్ డ్రైవ్ సమీపంలో ఉన్న డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ ప్రచార కార్యాలయంలో బుల్లెట్ల శబ్దం వినిపించినట్లుగా స్థానికులు తెలిపినట్లుగా టెంపే పోలీస్ డిపార్ట్‌మెంట్( Tempe Police Department ) పేర్కొంది.
రాత్రి కావడంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.అయితే ఆ భవనంలో పనిచేసేవారు, స్థానికుల భద్రత గురించి ఆందోళన వ్యక్తమవుతోంది.డిటెక్టివ్‌లు ఘటనాస్థలంలో సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు.సిబ్బంది, ఇతరులకు భద్రతను పెంచడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నట్లుగా మీడియా నివేదించింది.భవనానికి ఉన్న కిటికీలోంచి కాల్పులు జరిగినగ్లుగా తెలుస్తోంది.అయితే ఇటీవలి కాలంలో ఈ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.
సెప్టెంబర్ 16న కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత తుపాకీ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు.ఈ రెండు ఘటనల్లోనూ అరెస్ట్‌లు చోటు చేసుకోలేదు.
కానీ కాల్పులకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.