సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రం( Child Health Centre )లో వైద్యుల నిర్లక్ష్యంతో వరుస శిశు మరణాలు సంభవిస్తున్నా హాస్పిటల్ సిబ్బంది తీరు మారకపోవడంపై బాధితులు భగ్గుమంటున్న నేపథ్యంలో బుధవారం రాత్రి మరొక శిశువు మృతి చెందిన ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెన్ పహాడ్ మండలం( Penpahad Mandal ) గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన వనపట్ల మానసను బుధవారం సాయంత్రం డెలివరీ కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకురాగా, డ్యూటీ డాక్టర్ చూసి డెలివరీకి ఇంకా టైం ఉందంటూ పదే పదే చెప్తూ నిర్లక్ష్యం వహించారని,నా బిడ్డ నొప్పులకు తట్టుకోలేక పోతుందని, డెలివరీ చేయండంటూ డాక్టర్ కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో శిశువు మంచిగానే ఉందని చెప్పిన వైద్యులు,ఆ తర్వాత శిశువు మృతి చెందిందని తెలిపారని,ఉదయం మృతి చెందిన శిశువును ఇప్పటివరకు మాకు చూపించలేదని,మా చేతికి ఇవ్వలేదని,డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే మా బిడ్డ మృతి చెందిందని బాధితులు ఆరోపించారు.నిర్లక్ష్యం వహించిన డాక్టర్, సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.