ఎన్నో పోరాటాలు, మరెన్నో త్యాగాలు, ఇంకెన్నో కష్టాలు ఇవన్నీ కొన్ని సంవత్సరాలపాటు చేస్తే కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు.పార్టీ అధినేత జగన్ కూడా అదే రేంజ్ లో కష్టపడ్డాడు.
పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టాడు.ఫైనల్ గా పార్టీ అధికారంలోకి వచ్చింది.
పార్టీ కోసం కష్టపడ్డ వారంతా కాలర్ ఎగరేసుకుని మరీ సంబరపడ్డారు.అయితే ప్రస్తుతం పార్టీ అధికారంలో వచ్చి ఇంకా వందరోజులు కూడా దాటకుండానే అప్పుడే ఇంతా బయటా అనేక విమర్శలను పార్టీ ఎదుర్కుంటోంది.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమున్నామంటూ భరోసా కల్పించిన నాయకులు ప్రస్తుతం ప్రభుత్వ పదవుల్లో చేరిపోవడంతో పార్టీ కార్యక్రమాల గురించి పట్టించుకునే నాయకులే కరువయ్యారని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన చెందుతున్నారు.పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి విజయంలో తమ వంతు సహాయ సహకారాలు అందించిన తమకు ఆ ముఖ్య నేతలు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ ఆవేదన చెందుతున్నారట.

గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇదే సీన్ ఉండేదట.చాలామంది ముఖ్యమైన నాయకులు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఆయన ఏ మాత్రం పట్టించుకునేవాడే కాదట.దీనిపై అప్పట్లో టీడీపీలో పెద్ద చర్చే నడిచింది.వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అనేకమంది సీనియర్లు పార్టీని నడిపించవారు.జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలోనూ పార్టీ వ్యవహారాలన్నీ సీనియర్ నాయకులే చూసుకుంటూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసుకునేవారు.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పార్టీ కిందిస్థాయి నాయకులు చెప్పిన విషయాలు, సమస్యలు శ్రద్దగా విని ఆ విషయాలు పరిష్కరించడం, అవసరం అయితే జగన్ కు ఆ సమస్యల గురించి చెప్పడం చేసేవారు.
కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో వీరందరికీ పదవులు దక్కాయి.

విజయసాయిరెడ్డి ఢిల్లీలో వైసీపీ రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా తీరిక లేకుండా ఉన్నారు.
దీంతో పార్టీ వ్యవహారాలను పట్టించుకునే వారు కనిపించడంలేదు.ఇక బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు మంత్రి పదవిలో ఉండటంతో వారు కూడా క్యాడర్ కు అందుబాటులో ఉండడంలేదు.
దీంతో నేరుగా కొంతమంది నాయకులు తాడేపల్లి లోని జగన్ నివాసానికి వచ్చి అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ నాయకులు తమకు పదవులు దక్కలేదన్న అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలను పక్కన పెట్టేసారు.
ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ నాయకులు కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు.ప్రస్తుతం ప్రభుత్వంపై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.
పోలవరం, అమరావతి విషయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా ప్రభుత్వంపై మాటల యుద్ధం చేస్తున్నా గట్టిగా వారికి కౌంటర్లు ఇచ్చే పరిస్థితి లేదు.కేవలం ఒకరిద్దరు నాయకులు దీనిపై స్పందిస్తున్నారు తప్ప మిగతావారందరూ మనకెందుకులే అన్నట్టుగా ఉండిపోతున్నారు.