ఏపీ అధికార పార్టీ వైసిపి , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) మధ్య నిత్యం ఏదో ఒక పోరు జరుగుతూనే ఉంది.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ సొంత మీడియా అయిన సాక్షిలో వచ్చిన కథనాలపై అప్పటి అధికార పార్టీగా ఉన్న టిడిపి దాడులకు పాల్పడడం, అధికారుల ద్వారా వేధింపులు చేయడం వంటివి అప్పట్లో చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు టిడిపి అనుకూలం మీడియాలో పెద్ద ఎత్తున వైసిపి వ్యతిరేక కథనాలు వస్తున్నాయి.దీనిని ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే వస్తున్నారు.
ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై జగన్ సీరియస్ గా ఉన్నారు.దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ సొంత పత్రిక అయిన చైతన్య రథం పై వైసిపి , ప్రభుత్వ వ్యతిరేక కథనాలు పెద్ద ఎత్తున వస్తుండడంతో, దీనిపై చర్యలకు దిగింది.

మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలోని టిడిపి( TDP ) కేంద్ర కార్యాలయం వచ్చిన సిఐడి అధికారులు టిడిపి ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.పార్టీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న వార్త కథనాల పై వచ్చిన ఫిర్యాదులు పై స్పందించి ఈ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది.సిఐడి అధికారులు చైతన్య రథం పత్రికపై పార్టీ నేతలను ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అసలు ఈ చైతన్య రథం( Chaitanya ratham ) పత్రికను ఎవరు నడుపుతున్నారు ? ఎక్కడ నుంచి నడుపుతున్నారు ? దీనికి ఎడిటర్ ఎవరు ? కార్యాలయం ఎక్కడ ఉంది ? ఇలా అనేక అంశాలపై సిఐడి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.ఈ మేరకు విచారణకు రావలసిందిగా టిడిపి ప్రధాన కార్యదర్శి ని ఆదేశించినట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై టీడీపీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.







