మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న కాంగ్రెస్ నేత రేణుక చౌదరి ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపడుతున్న అమరావతి ఉద్యమానికి రేణుక చౌదరి మద్దతు తెలపడమే కాకుండా , ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి.ఖమ్మంలో రేణుక చౌదరి గెలిచే ప్రసక్తే లేదు అంటూ నాని సెటైర్లు వేయడంతో రేణుక చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ… రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ సవాల్ చేశారు.
అంతేకాదు తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా తనకు అవసరం లేదని , గుడివాడలో కొడాలి నానిని ఓడించి తన సత్తా చాటుతానంటూ రేణుక చౌదరి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం ఎంపీగా అనేకసార్లు తాను గెలిచానని, కొడాలి నాని వచ్చి ఖమ్మం జిల్లాలోని గల్లీలో తిరిగితే తన సత్తా ఏమిటో తెలుస్తుందంటూ అప్పట్లోనే రేణుక చౌదరి వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారం తర్వాత సైలెంట్ గానే ఉన్నారు.తాజాగా మరోసారి ఏపీ రాజకీయాల వ్యవహారాలపై ఆమె స్పందించారు.ఏపీలో జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని విమర్శించారు.తమ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే, ఏపీ నుంచి పోటీ చేస్తానని విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రేణుక చౌదరి ప్రకటించారు.

రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని, రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు ఇచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం ఆదుకోవడం లేదని చెబుతున్న రేణుక అందుకే విజయవాడ పార్లమెంట్ నుంచి తాను పోటీ చేసి గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేశారు.కొద్ది నెలల క్రితం గుడివాడ అసెంబ్లీకి పోటీ చేస్తానంటూ రేణుక కొడాలి నాని కి సవాల్ విసిరారు.ఇప్పుడు విజయవాడ లోక్ సభ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించడం, అసలు రేణుక ఈ ప్రకటనలు చేస్తున్నా.ఏపీ కాంగ్రెస్ నాయకులు నుంచి స్పందన రాకపోవడం వంటివి అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

ఏపీ , తెలంగాణ, కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే రేణుక ఈ విధంగా ప్రకటనలు చేస్తుండడం తో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ అయోమయానికి కారణం అవుతుంది. ఒకవేళ రేణుక నిజంగానే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా.గుడివాడ అసెంబ్లీ , విజయవాడ లోక్ సభ స్థానం పరిధిలో కాంగ్రెస్ బలం ఎంత ? టిడిపి మద్దతు లేకుండానే కాంగ్రెస్ నుంచి గెలుస్తానంటూ రేణుక ప్రకటనలు చేయడం వెనక ఆమె ధీమా ఏమిటి అనే ప్రశ్నలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి.మొత్తంగా ఈ పరిణామాలు అన్నీ విశ్లేషిస్తే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే విషయంలో రేణుక కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.







