తన అన్న వైసీపీ అధినేత జగన్ ను( YS Jagan ) టార్గెట్ చేసుకుని ఆమె సోదరి , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.రాజకీయంగానూ , వ్యక్తిగతంగాను షర్మిల చేస్తున్న విమర్శలు జగన్ కు, వైసిపికి ఇబ్బందికరంగానే మారాయి.
ఏపీలో టీడీపీ, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చినా, అవి కాంగ్రెస్ కు ప్రత్యర్ధులే అయినా , వారిని టాబ్లెట్ చేసుకోకుండా పూర్తిగా జగన్ వైసీపీ నే టార్గెట్ చేసుకుని షర్మిల విమర్శలు చేస్తుండడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఇప్పటికి అంతు పట్టడం లేదు.అయితే షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ( YCP ) నుంచి పెద్దగా కౌంటర్లు ఇవ్వకపోవడంతో ఆమె మరింతగా తమ విమర్శలు దాడి పెంచుతున్నారు.

జగన్ ను పూర్తిగా రాజకీయ ప్రత్యర్థి గానే షర్మిల చూస్తున్నారు. వ్యక్తిగత విభేదాలతో పాటు, రాజకీయ వైరం ఇవన్నీ లెక్కలేసుకుని మరీ విమర్శల బాణాలు షర్మిల వదులుతున్నారు. అసెంబ్లీకి జగన్ హాజరు కాకపోవడం దగ్గర నుంచి, అన్ని అంశాల పైన కూటమి నేతల కన్నా షర్మిల ఎక్కువగా జగన్ పై విమర్శలు చేస్తూ. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తూ , వాటిపై చర్చ జరిగేలా చేస్తున్నారు.
పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే , కూటమి నేతలకు భయపడి ఇంట్లో కూర్చుంటావా వెంటనే పదవికి రాజీనామా చేయాలి అంటూ షర్మిల చేస్తున్న డిమాండ్లు జగన్కు తలనొప్పిగా మారాయి.

గత కొంతకాలంగా జగన్ ను షర్మిల టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా. వైసిపి నుంచి పెద్దగా ఎదురుదాడి లేకపోవడం చర్చనీయాంశం గా మారింది.షర్మిల వ్యాఖ్యలపై స్పందించేందుకు వైసిపి నేతలు అంతగా ఆసక్తి చూపించడం లేదు.
అయితే ఇదంతా వ్యూహాత్మక మౌనంగానే తెలుస్తోంది. జగన్ ఇండియా కూటమి( India Alliance ) వైపు ఆసక్తిగా చూస్తున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది .దీంతో షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తప్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. షర్మిల జగన్ ను ఎంతగా టార్గెట్ చేసినా, సైలెంట్ గా ఉండడమే మంచిది అని, లేకపోతే ఇండియా కూటమికి దగ్గరయ్యేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధాగా మారుతాయి అని అందుకే వ్యూహాత్మక మౌనం షర్మిల విషయంలో జగన్ పాటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.