ఎవరిని మోసం చేస్తున్నారు రజినీ జీ?       2018-06-17   01:09:25  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తాజాగా ‘కాలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొంత కాలంగా రజినీకాంత్‌ నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతున్నాయి. అదే దారిలో ‘కాలా’ చిత్రం కూడా నిలిచిందని చెప్పక తప్పదు. తమిళంలో కాస్త పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు సాధించిన కాలా తెలుగులో మాత్రం దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో, నేపథ్యంతో తెలుగు ప్రేక్షకులు తిరష్కరించేలా సినిమా ఉంది. ఇక ఈ చిత్రం తమిళంలో మాత్రం గౌరవ ప్రధమైన వసూళ్లను రాబట్టింది.

ఓవర్సీస్‌లో కూడా భారీగా విడుదల అయిన ‘కాలా’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. తమిళ వర్షన్‌ అమెరికాలో రెండు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. రజినీకాంత్‌ స్థాయికి ఆ వసూళ్లు కనీసం లెక్క కూడా కాదు. అయినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు గొప్పగా ప్రకటిస్తున్నారు. ఇక సినిమా ఫ్లాప్‌ అయినా కూడా ప్రచారం కోసం మా సినిమా సూపర్‌, ఆహా, ఓహో అంటూ కొందరు హీరోలు ప్రచారం చేస్తూ ఉంటారు. స్టార్‌ హీరోలు మాత్రం అలా చేయరు, అలా చేయడం వల్ల తమ గౌరవం దెబ్బ తింటుందనే విషయం వారికి తెలుసు. కబాలి చిత్రం ఆకట్టుకోలేక పోయిన సమయంలో రజినీకాంత్‌ స్వయంగా తర్వాత సినిమాతో తప్పకుండా మెప్పిస్తాను అంటూ హామీ ఇచ్చాడు.

‘కాలా’ సినిమా విషయానికి వచ్చేప్పటికి రజినీకాంత్‌ తన పద్దతిని మార్చేసుకున్నాడు. తన అల్లుడి సినిమా అవ్వడం వల్లో లేదా వరుసగా సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నాయన్న ఆవేదనో కాని, కాలా సినిమా సూపర్‌ హిట్‌ అంటూ చెబుతున్నాడు. విడుదలైన అంతటా కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని, మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా విదేశాల్లో కూడా ఇంకా బాగా ఆడుతుందని చెప్పుకొచ్చాడు.

సూపర్‌ స్టార్‌ అయిన రజినీకాంత్‌ ఇలా సినిమా ప్రమోషన్స్‌ కోసం సిల్లీగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, ప్రస్తుతం సోషల్‌ మీడియా చాలా పవర్‌ ఫుల్‌గా ఉంది. ఇప్పటికే కలెక్షన్స్‌ అందరికి తెలిసి పోయాయి. ఇలాంటి సమయంలో రజినీకాంత్‌ ఫేక్‌ కలెక్షన్స్‌ ప్రకటించడం వల్ల తనను తాను తగ్గించుకోవడం అవుతుంది తప్ప మరేం లేదు అంటూ రజినీకాంత్‌పై స్వయంగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తర్వాత సినిమా గురించి రజినీకాంత్‌ దృష్టి పెట్టాని, ఇంకా ఏ ఇతర విషయాల గురించి ఆయన పట్టించుకోవద్దని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.