ఇటీవల కాలంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నిర్ణయాలు చాలా వేగంగా ఉంటున్నాయి.పార్టీలోను, ప్రభుత్వంలోనూ అనేక ప్రక్షాళన లకు శ్రీకారం చుట్టారు.
ప్రజల్లో ఎక్కువగా ఉంటూ, క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడుతున్నారు. కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు.
అలాగే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న అనేక అంశాలను ఆయన క్లియర్ చేస్తున్నారు.పార్టీ శ్రేణులు అందర్నీ యాక్టివ్ చేయడంతో పాటు, పార్టీ పదవుల విషయంలోనూ ప్రక్షాళన మొదలుపెట్టారు .పార్టీ పదవుల్లో చురుగ్గా లేకుండా, పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేని వారందరినీ పదవుల నుంచి తప్పించారు .ఆ స్థానాల్లో చురుకైన నేతలను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టారు.అయితే జగన్ ఒక్కసారిగా ఈ వేగం పెంచడానికి కారణాలు ఏంటనేది ఎవరికి అంతు పట్టడం లేదు.
అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో జగన్ ఉన్నారని, అందుకే ఈ విధంగా స్పీడ్ పెంచారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.
వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండడం, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో మరింత పెంచి తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో , విపక్ష పార్టీలకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమకు కలిసి వస్తుందని జగన్ భావిస్తున్నారట.దీనికి తోడు తమ పార్టీకి రాజకీయ సలహాలు అందిస్తున్న ఐ ప్యాక్ టీం సైతం ముందస్తు ఎన్నికలకు వెళితే ఫలితం అనుకూలంగా ఉంటుందని తేల్చి చెప్పడంతో, జగన్ కూడా అలెర్ట్అయ్యారట.
టిడిపి , జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అని, సునాయాసంగా గెలవగలుగుతుందని జగన్ తో పాటు, పీకే టీం అంచనా వేస్తోంది.అందుకే పథకాల్లో వేగం పెంచినట్టుగా కనిపిస్తున్నారు.

షెడ్యూల్ కంటే ముందుగానే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికే ఏపీలో రాజకీయ పరిస్థితులు వైసీపీకి అనుకూలత, వ్యతిరేకత, విపక్షాల పరిస్థితి, ఇలా అనేక అంశాలపై ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ టీం సర్వే నిర్వహిస్తోంది.అలాగే గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో జరుగుతున్న కార్యక్రమం పై ప్రజల్లో వస్తున్న స్పందన, వైసిపి ఎమ్మెల్యేలపై ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉంది అనే విషయాలను ప్రశాంత్ కిషోర్ టీం సమగ్రంగా నివేదిక రూపంలో తయారుచేసి జగన్ కు అందిస్తోంది.ఇప్పటికే పనితీరు సక్రమంగా లేని వారు , టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదనుకున్న వారికి జగన్ వార్నింగ్ లు ఇచ్చారు.
అవసరమైతే వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కూడా జగన్ తేల్చి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఏది ఏమైనా పీకే టీం , జగన్ కు అందిన ఇంటిలిజెన్స్ నివేదికలతో ముందస్తు ఎన్నికల ఆలోచనతోనే జగన్ ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది.