ఏ దేశంలో అయినా పెట్రోల్ రేట్లు( Petrol Price ) అందరికీ ఒకే రీతిలో ఉంటాయి.అయితే నానాటికీ పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడుతుంది.రవాణా ఖర్చులు పెరగడంతో ఆ ప్రభావం ఇతర వస్తువుల ధరలపై కూడా పడుతుంది.
ఆర్థిక మాంద్యం వల్ల పాకిస్థాన్‌లో( Pakistan ) పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి.ముఖ్యంగా పెట్రోల్ ధరలు సామాన్యులు ఊహించని స్థాయికి చేరుకున్నాయి.
ఈ తరుణంలో పాకిస్థాన్ మంత్రి ముస్సాడిక్ మాలిక్( Musadik Malik ) సోమవారం కీలక ప్రకటన చేశారు.పెట్రోల్ ధరలను పేదలకు, ధనవంతులకు వేర్వేరుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఇది పలు దేశాలను ఆశ్చర్యపరుస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పాకిస్తాన్ పెట్రోలియం డివిజన్ చాలాకాలంగా అమెరికా నుంచి 50 యూఎస్ డాలర్లకు కొనుగోలు చేస్తోంది.రష్యా దానిని 40 యూఎస్ డాలర్ల ధరకే అందిస్తోంది.ఇటీవలే రష్యా నుండి చమురు కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు.మరో నెలలో రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు రానుంది.దీనిపై పాకిస్థాన్ మంత్రి ముస్సాడిక్ మాలిక్ కీలక ప్రకటన చేశారు.ప్రభుత్వం ప్రజలకు చౌక ధరకే పెట్రోల్, డీజిల్ అందిస్తుందని తెలిపారు.
పేద, ధనిక వర్గాలకు వేర్వేరు ధరలు నిర్ణయించబడతాయని వెల్లడించారు.

పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతోందని, అందువల్ల చౌక ధరలకు చమురును ఎలా దిగుమతి చేసుకోవాలో వెతుకుతున్నామని పేర్కొన్నారు.తమ ఆలోచనలు అమల్లోకి వచ్చిన తర్వాత పేద, ధనిక వర్గాలకు వేర్వేరుగా ధరలు ఉంటాయన్నారు.చమురు, గ్యాస్ సరఫరా కోసం మాలిక్ కొన్నాళ్ల క్రితం రష్యాను కూడా సందర్శించారు.
ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి రష్యా ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌లో రెండు నెలల క్రితం పర్యటించింది.ఏదేమైనా పాకిస్థాన్ చేసిన ప్రకటన అందరినీ ఆలోచింపజేస్తోంది.పేదలకు, ధనికులకు వేర్వేరుగా పెట్రోల్, గ్యాస్ ధరలు ఉండడాన్ని కొందరు సమర్ధిస్తున్నారు.