2024 ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ గెలిచి అధికారంలోకి మళ్లీ తీసుకురావాలి అనే లక్ష్యాన్ని జగన్ నిర్దేశించుకున్నారు.అంతేకాదు పార్టీ నాయకులు ఇదే లక్ష్యంతో పనిచేయాలని, ఇప్పటి నుంచే జనంతో మమేకమవుతూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ , నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని, ప్రజల్లో ఎక్కడా అసంతృప్తి కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల్లో ఉందని జగన్ పదేపదే చెబుతున్నారు.
అయినా చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ, సొంత వ్యాపార వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారనే నివేదికలు అందడంతో, గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా జనాలకు ఎమ్మెల్యేలను చేరువ చేయాలని జగన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
అయితే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంత ఆసక్తి చూపించక పోవడం వంటి వాటిపై జగన్ కు నివేదికలు అందాయి.
దీనిపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో దాదాపు 27 మంది ఎమ్మెల్యేల పేర్లను చదివి మరి వారందరికీ వార్నింగ్ జగన్ ఇచ్చారు.ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
పని తీరును మార్చుకోవాలని, మరోసారి సర్వే చేయిస్తానని అప్పుడు కూడా గ్రాఫ్ పెరగకపోతే ఇక టికెట్ ఇవ్వడం సాధ్యం కాదంటూ తేల్చేశారు.అయితే ఈ లిస్టులో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారితో పాటు , పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో అండగా నిలిచినవారు ఎంతోమంది ఉన్నారు.

అయితే మీరు ఎందుకు జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.? పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదనే విషయంపై జగన్ తో పాటు పార్టీ వర్గాల్లోనూ, జనాల్లోనూ సందిగ్ధం నెలకొంది.అయితే ఈ లిస్టులో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పై ఆశలు పెట్టుకున్నారు.ఇప్పటికే మంత్రి పదవులు అనుభవించి పదవులు కోల్పోయిన వారితో పాటు, గతం నుంచి వైసీపీలో గెలుస్తూ జగన్ కు సన్నిహితులుగా ముద్ర వేయించుకున్న తమను కాదని కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు.
జగన్ సామాజిక వర్గాల సమతూకం అనే లెక్కలతో చాలామంది సన్నిహితులను పక్కన పెట్టడంతో, వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారట.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, గ్రంధి శ్రీనివాస్ , చీర్ల జగ్గిరెడ్డి, కోడుమూరు శ్రీనివాసులు, శిల్పా చక్రపాణి రెడ్డి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది మంత్రి పదవులను ఆశించారు.
కానీ వారు ఎవరికి పదవులు దక్కక పోవడం తో పార్టీ కార్యక్రమాల్లో వీరంతా ఆసక్తిగా పాల్గొనడం లేదట.







