ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని చీరాల మునిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీలోనే తీవ్ర పోటీ నెలకొనడంతో ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది.ఇక్కడి 33 వార్డుల్లో 3 ఏకగ్రీవం అయ్యాయి.
మిగిలిన వాటిలో పోటీ జరుగుతోంది.అయితే ఇక్కడ వైసీపీ ఒరిజినల్ టీం (ఓటీ), డూప్లికేట్ టీం(డీటీ)ల మధ్యే ఎన్నికల పోరు రసతవత్తరంగా మారింది.
ఒరిజినల్ టీం అంటే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం.గత ఎన్నికలకు ముందు అంటే 2019కి ముందు వైసీపీలో చేరిన ఆమంచి వర్గం ఇప్పుడు జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి బీఫాంలు అందుకోలేక పోయింది.
అయితే ఏడాది కూడా కానిటీడీపీ ఎమ్మెల్యే, వైసీపీకి మద్దతుదారుగా మారిన కరణం బలరాం వర్గం డూప్లికేట్ టీంగా ప్రచారంలో ఉంది.అయితే వీరు మాత్రం అధిష్టా నం నుంచి బీఫాంలు తెచ్చుకున్నారు.
వాస్తవానికి ఇక్కడ మునిసిపల్ ఎన్నికల్లో ఆమంచి వర్గం బీఫారం తెచ్చుకుంటుందని అందరూ అనుకున్నారు.కనీసం రెండు వర్గాలకు సగం సగం బీ ఫాంలు అయినా ఇస్తారనే అందరూ భావించారు.
వైసీపీలో అధినేత జగన్ ఆశీస్సులు పుష్కలం గా ఉన్నాయని ఆమంచి వర్గం భావిస్తోంది.అయితే అనూహ్యం గా మధ్యలో పార్టీలోకి వచ్చిన కరణం వర్గం 30వార్డులకు గాను బీఫాంలు తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో ఆమంచి వర్గం రెబెల్‌గా ఇక్కడ చక్రం తిప్పుతోంది.

మొత్తం 29 వార్డుల్లో ఆమంచి వర్గం వైసీపీలో ఉన్న నాయకులకు అవకాశం కల్పించింది.కానీ, కరణం మాత్రం టీడీపీ నుంచి వచ్చిన వారికి, తన అనుచరులకు ఇక్కడ అవకాశం ఇచ్చారు.వాస్తవంగా ఇక్కడ ఆమంచి వర్గంలో రెబెల్స్‌గా నామినేషన్ వేసిన వారే అసలు వైసీపీ నేతలు.
ఈ పరిణామంతో చీరాల మునిసిపాలిటీలో ఓటీ వర్సెస్ డీటీగా ఎన్నికలు మారిపోయాయి.ఇక, బలాబలాల విషయానికి వస్తే ఆమంచి వర్గం రెబెల్‌గా బరిలోకి దిగినా బలంగా పోటీ చేస్తోంది.
కరణం వర్గానికి ధీటుగా ప్రచారం చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి ప్రచార హోరును పెంచింది.ఆమంచి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
తన హవాను నిరూపించుకునేందుకు ఆయనకు దీనిని ప్రధాన అస్త్రంగా భావించారు.ఇక, కరణం కూడా తన వర్గాన్ని గెలిపించుకుంటేనే చీరాలలో పట్టు నిలుస్తుందని లేకపోతే ఇక్కడ నుంచి తప్పుకోక తప్పదని భావించే గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య హోరా హోరీ పోరు సాగుతుండడం గమనార్హం.ఈ నెల 10న ఇక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయం ఉత్కంఠగా ? మారింది.