కోవిడ్ పాజిటివిటీ రేటు క్షీణిస్తుండటం, ఆసుపత్రిలో చేరికలు తగ్గుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో కెనడాలోని అంటారియో ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.మార్చి 21 నుంచి అక్కడ మాస్క్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేయనుంది.
నాటి నుంచి మాస్క్ ధరించాలన్న నిబంధన వుండదని.ప్రజలకు ఇష్టాన్ని బట్టి ధరించుకోవచ్చని అంటారియో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కీరన్ మూర్ అన్నారు.
అయితే వైరస్ బారినపడిన వారు మాత్రం మాస్క్‌లు ధరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
బుధవారం నాటికి అంటారియో ప్రావిన్స్‌లో 1,974 కొత్త కేసులు నమోదయ్యాయని కీరన్ మూర్ తెలిపారు.
తాము కోవిడ్‌తో సహజీవనం చేయడం నేర్చుకున్నామని ఆయన అన్నారు.ప్రజలు తమ సొంత రిస్క్ మేరకు మాస్క్‌ను పక్కన పెట్టుకోవచ్చునని మూర్ చెప్పారు.
అంటారియో ప్రీమియర్ డౌగ్ ఫోర్డ్ బుధవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.మార్చి 2020 నుంచి కోవిడ్‌తో సహజీవనంపై ప్రపంచం ఎంతో నేర్చుకుందన్నారు.
అంటారియో ప్రస్తుతం చాలా మెరుగైన స్ధితిలో వుందని డౌగ్ తెలిపారు.
ఇకపోతే.
అమెరికా- కెనడా మధ్య రవాణా సేవలు అందించే ట్రక్కర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం అక్కడ ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.ట్రూడో సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రాజధాని ఒట్టావాను ముట్టడించారు.
రోజురోజుకు పరిస్ధితులు అదుపు తప్పుతుండటంతో ప్రధాని జస్టిన్ ట్రూడో ఎమర్జెన్సీ సైతం విధించారు.ట్రక్కు డ్రైవర్ల నిరసనల కారణంగా జనజీవనం స్తంభించిపోయిన క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ట్రూడో వెల్లడించారు.

కెనడా ప్రజల భద్రతను, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.అయితే దీని కారణంగా వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో బలప్రయోగం ద్వారానైనా పరిస్ధితిని అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది.ఈ చర్యలు ఫలించి రాజధాని ఒట్టావా నగరం తిరిగి భద్రతా దళాల చేతుల్లోకి వచ్చింది.ట్రక్కర్లను ఎదుర్కొన్న పోలీసులు వారిని పార్లమెంట్ హిల్ వెలుపల నుంచి తరిమికొట్టారు.
పరిస్దితుల నేపథ్యంలో ఒట్టావాలో కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు.







