ఉన్నత చదువులు చదువుకుని ఎన్నో ఆశలతో, అత్యుత్తమమైన జీవితం గడపాలని, తమ తల్లి తండ్రుల కష్టాలకు ప్రతిఫలం ఇవ్వాలని కలలు కని విదేశాలకు వెళ్ళిన ఇద్దరు ఎన్నారైలు ఊహించని విధంగా ప్రమాదానికి గురయిన ఘటన కెనడాలో తీవ్ర విషాదాన్ని నింపింది.కెనడాలోని ఒంటారియాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఇద్దరు తెలుగు ఎన్నారైలపై దూసుకెళ్ళిన కారు ఒకరి ప్రాణాలను బలితీసుకోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం ప్రమాదం జరిగిన తీరు ఆ ఇద్దరు తెలుగు ఎన్నారైలను మృత్యువు ఎలా వెంటాడిందో అర్థమవుతుంది.
అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే…
కెనడాలో ఉంటున్న ఎపీలోని ఒంగోలు కు చెందిన రామకృష్ణ , చిత్తూరు జిల్లా కు చెందిన పురుషోత్తం రెడ్డి తమ మిత్రులను కలిసేందుకు కారులో వెళ్తున్న క్రమంలో ఒంటారియా స్టేట్ హైవే పై వేగంగా వచ్చిన ఓ కారు వీరి కారును బలంగా డీ కొట్టింది.అయితే కేవలం కారుకు మాత్రమే డ్యామేజ్ జరగడంతో ఇద్దరూ సేఫ్ గా ఉన్నారు.
అసలేం అయ్యిందని కారులోంచి కిందకు దిగి వెనుక నుంచీ డీ కొట్టిన కారు గల వ్యక్తితో వాగ్వాదానికి దిగారు.
గొడవ అనంతరం ప్రమాదం నుంచీ తప్పించుకున్నాం కదా అనుకుంటూ తమ కారు వద్దకు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచీ వేగంగా వచ్చిన మరొక వాహనం వారి ఇద్దరినీ బలంగా డీ కొట్టడంతో ఒంగోలు కి చెందిన రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు.
మరొక ఎన్నారై పురుషోత్తం రెడ్డి ప్రాణాలతో పోరాడుతున్నారు.రామకృష్ణ, పురుషోత్తం రెడ్డి ఇద్దరూ ఏపీ ఎన్ఆర్ టీఎస్ లో కో ఆర్డినేటర్, రీజనల్ కో ఆర్డినేటర్ గా సేవలు అందిస్తున్నారు.
ఇదిలాఉంటే రామ కృష్ణ మృత దేహాన్ని ఏపీ కి తీసుకువచ్చేందుకు కెనడాలోని తెలుగు సంఘాలు కృషి చేస్తున్నాయి.
.