రాజన్న సిరిసిల్ల జిల్లా: లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ,తుది ఓటరు జాబితా రూపకల్పన పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ఏప్రిల్ 26 నాటికి తుది ఓటరు జాబితా రూపొందించాలని అన్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఓటర్ స్లిప్పులు ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలని, ముందస్తుగానే ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టాలని, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూల్ పై పోటీ చేసే అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు ముందస్తుగా సమాచారం అందించాలన్నారు.పోటీ చేసే అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలు నియమించిన పోలింగ్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు ఓటర్ స్లిప్ లు పంపిణీ చేసే సమయంలో పాల్గోనవఛ్చని, ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎక్కడ మాకు అందలేదనే ఫిర్యాదులు రావద్దని అన్నారు.
ఏప్రిల్ 18న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని , ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు.
నామినేషన్ స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ, పోటీ చేసే తుది అభ్యర్థుల జాబితా ప్రకటన, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ రూపకల్పన వంటి అంశాలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
నామినేషన్ స్వీకరణ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, పోటి చేసే అభ్యర్థుల సహాయార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అన్నారు.నామినేషన్ దాఖలుకు ముందు ప్రీ వెరిఫికేషన్ డెస్క్ వద్ద పరిశీలించాలని అన్నారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి సాధ్యమైనంతవరకు ప్రత్యేక ఎంట్రీ ఎగ్జిట్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో వీడియోగ్రాఫీ, ఫోటో గ్రాఫీ జరగాలని, రిటర్నింగ్ అధికారి చాంబర్ లో సిసి కేమేరాలు ఏర్పాటు చేయాలని, నామినేషన్ల స్వీకరణ పై ప్రతి రోజు నివేదికలను సమర్పించాలని, ప్రతి రోజూ దాఖలైన నామినేషన్, అభ్యర్థుల అఫిడవిట్ లు పారదర్శకంగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.