కెనడాకు( Canada ) చెందిన విలియం రోసీ( William Rossi ) అనే ఓ వ్లాగర్ ఇండియా ట్రిప్ తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఐదు వారాల పాటు ఇండియాలో గడిపిన తర్వాత తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.మోటివేషనల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చెప్పుకునే రోసీ, ఇండియా ట్రిప్ ఊహించని అనుభవాలతో నిండిపోయిందని చెప్పాడు.
“నేను ఇప్పటివరకు 37 దేశాలు తిరిగాను.కానీ ఇండియా మాత్రం అన్నింటికంటే షాకింగ్‌గా అనిపించింది.అక్కడ మీరు చూసేవి, వినేవి, వాసన చూసేవి, రుచి చూసేవి, మీరు ఎప్పుడూ ఊహించని విధంగా మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, ఫీల్ అయ్యేలా చేస్తాయి, ప్రవర్తించేలా చేస్తాయి” అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు.
ఇండియాలో ఎప్పటికీ ఉండాలని అనుకోనని రోసీ కుండబద్దలు కొట్టాడు.కానీ ఈ దేశంలో తన ప్రయాణం మాత్రం జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిందని చెప్పాడు.ఇండియా వైవిధ్యమైన సంస్కృతి, బలమైన భావోద్వేగాలు, సెన్సులపై తీవ్ర ప్రభావం చూపే దేశం అంటూ కొన్ని ఫొటోలను కూడా జత చేశాడు.
అయితే రోసీ చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు అతడు నిజాయితీగా తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ఇండియా గురించి అతడి అభిప్రాయం చాలా తక్కువగా ఉందని, దేశ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించలేదని విమర్శిస్తున్నారు.”మా ఇండియాను మీరు ప్రేమించినందుకు థాంక్స్.మీ ట్రిప్ నుంచి మీరు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఇండియాలో మీరు చూసింది ఇంతేనా? చాలా బాధగా ఉంది” అని మరొకరు రాసుకొచ్చారు.ఇంకొక నెటిజన్ అయితే “స్నేహపూర్వక ప్రజలు, గొప్ప ఆర్కిటెక్చర్, అంతేనా? ఈ పాఠాలు న్యూయార్క్ సిటీలో( New York City ) కూడా నేర్చుకోవచ్చు.దీనికోసం మీరు ఇండియా వరకు రావాల్సిన అవసరం లేదు.” అంటూ చురకలంటించారు.
ఇంకా కొంతమంది యూజర్లు మాత్రం రోసీ ఇండియాలో మంచి, చెడు రెండింటినీ చూపించాడని అతడిని సమర్థించారు.విలియం రోసీ గతంలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేసి లక్షల్లో జీతం అందుకునేవాడట.కానీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రపంచమంతా తిరుగుతూ ఇతరులకు స్ఫూర్తినిచ్చే తన కలను నెరవేర్చుకుంటున్నాడు.ప్రస్తుతం “స్ప్రౌట్” అనే పర్సనల్ గ్రోత్ బ్రాండ్‌ను నడుపుతున్నాడు.