అనపర్తి ( Anaparthi ) తెలుగుదేశం పార్టీలో సీట్ల కుంపటి భగ్గుమంటోంది.అక్కడ టికెట్ తనదేనని, తానే పోటీ చేసి గెలుస్తాననే నమ్మకంతో ఉంటూ వచ్చిన మాజీ టిడిపి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కి( Nallamilli Ramakrishna Reddy ) టిడిపి విడుదల చేసిన మొదటి విడత జాబితాలోనే చోటు దక్కింది.
దీంతో ఆయన నియోజకవర్గమంతా పర్యటిస్తూ, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.అయితే ఆ తరువాత టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడడంతో, బిజెపికి పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలను కేటాయించారు.
ఆ పది అసెంబ్లీ సీట్లలో అనపర్తి బిజెపికి కేటాయించడంతో, అక్కడ బిజెపి అభ్యర్థిగా మొలగపాటి శివరామకృష్ణం రాజు( Mulagapati Shivaramakrishnam Raju ) పేరును ప్రకటించారు.అయితే ఈ విషయాన్ని రామకృష్ణారెడ్డికి ముందుగా తెలియజేయకపోవడం, టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి బిజెపికి ఆ సీటు కేటాయించడంపై నల్లిమిల్లి అనుచరులు చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
గత నాలుగు రోజులుగా అనపర్తి సీటు విషయంలో టిడిపిలోను పెద్ద చర్చ జరుగుతోంది.అయితే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అనుచరులు ఎవరు ఆవేశ పడొద్దు అంటూ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సర్ది చెబుతూ వచ్చారు.
బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారం లో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దు అంటూ నిలిపివయడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామకృష్ణారెడ్డి పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి పదవులకు రాజీనామా చేస్తూ రాజ్యమహేంద్రవరంలో ఉన్న టిడిపి జోన్ 24 కోఆర్డినేటర్ వెంకట సుజయ్ కృష్ణ రంగారావుకు లేఖలు అందించారు.మంగళవారం బిక్కవోలు మండలం వందలపాక గ్రామంలో ధర్నా చేశారు.బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు.అదేరోజు సాయంత్రం బిజెపి అభ్యర్థిగా శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు( TDP Leaders ) కార్యకర్తలు మరింత ఆగ్రహానికి గురయ్యారు.
అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయగా రామకృష్ణారెడ్డి వారిని వారించారు.ఇక గురువారం రాయవరంలోని రామకృష్ణారెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు చేరుకుని భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.ఎప్పటికైనా టిడిపి అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి రామకృష్ణ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.40 సంవత్సరాలుగా నియోజకవర్గంలో టిడిపి జెండా మోస్తున్న నల్లిమిల్లి కుటుంబానికి చంద్రబాబు( Chandrababu ) తీవ్ర అన్యాయం చేశారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కట్టప్ప రాజకీయాలు చేయవద్దంటూ చంద్రబాబు పై విమర్శలు చేశారు ఈ సందర్భంగా టిడిపి ఎన్నికల ప్రచార కరపత్రాలు పార్టీ జెండాలను కుప్పగా పోసి తగలబెట్టారు.