నల్లగొండ జిల్లా: నల్లగొండ మున్సిపల్ కమీషనర్ కె.వి.
రమణాచారి గురువారం చెప్పా పెట్టకుండా రాజీనామా చేసి,కనీసం చైర్మన్ ను కూడా కలవకుండా,తాను ఉంటున్న నివాసాన్ని కూడా ఉన్నఫలంగా ఖాళీ చేసి ప్రభుత్వం మారగానే పలాయనం చిత్తగించడం, ఆయన స్థానంలో అదే రోజు పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వెంకటేశ్వర్లును ఇంచార్జ్ కమీషనర్ గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఉత్తర్వులు జారీ చేయడంపై పట్టణంలో పలు కథనాలు వినిపిస్తున్నాయి.ఎవరీ రమణాచారి…? మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడు.సిద్దిపేటలో మున్సిపల్ కమీషనర్ గా,సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా విధులు నిర్వహించే రిటైర్డ్ ఉద్యోగి.
నల్లగొండను సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్న నేపథ్యంలో స్పెషల్ కమీషనర్ గా నల్లగొండకు పంపిస్తే 2022 జనవరి 5న నీలగిరి మున్సిపల్ కమీషనర్ గా భాధ్యతలు స్వీకరించారు.
వచ్చిరాగానే ఉద్యోగులను విధినిర్వహణలో ఉరుకులు పరుగులు పెట్టించడం,మీకు వెసులుబాటు ఇవ్వాలంటే నాకు అమౌంట్ ఇవ్వాలని బెదిరించడం,ఉదయం 8 గంటలకే విధులకు హాజరై రాత్రి 8 గంటల వరకు ఆఫిస్ లోనే ఉండాలని ఒత్తిడి చేయడంతో రాను రాను ఉద్యోగుల్లో సమయపాలనపై అసంతృప్తి పెరిగింది.
కానీ, సీఎం కేసీఆర్ పంపిన కమీషనర్ కావడం, పట్టణాభివృద్ధికి ఎక్కువ పని గంటలు చేయాలని మొదట్లోనే ఉద్యోగులకు చెప్పడం కారణంగా ఉద్యోగులు అయిష్టంగానే విధులు నిర్వహించేవారు.కమీషనర్ వేధింపులు అధికం కావడంతో గత ఆరు నెలల నుంచి ఇంకా ఎన్నాళ్లు ఈ ఎక్కువ పని గంటలు? అనే చర్చ ఉద్యోగుల్లో మొదలై,ఏది ఏమైనాకానీ,సమయ పాలన వరకే ఉండాలని ఇటీవల నుండి ఉద్యోగులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకే విధుల్లో ఉండడం మొదలుపెట్టారు.
ఇంతలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం కూడా మారడంతో ఉద్యోగుల్లో కూడా మార్పు వచ్చింది.రమణాచారి వచ్చింది మొదలు మున్సిపాలిటీలో అనేక అక్రమాలు, అక్రమ వసూళ్లు, అవినీతి, కబ్జాలు జరిగాయని, కమీషనర్ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు.59 జీవోను అడ్డంపెట్టుకుని పట్టణంలో రూ.10 కోట్ల విలువైన భూ దోపిడి జరిగిందని,రెండో దఫాలో చెత్తబుట్టల పంపిణీ చేయకుండానే బిల్లులు కాజేశారని,మున్సిపాలిటీలో 40 మంది సిబ్బంది పని చేయకుండా జీతాలు తీసుకున్నారని,క్లాక్ టవర్ నుంచి మర్రిగూడ బైపాస్ వరకు చేసిన పెద్ద రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని,జంక్షన్లో ఏర్పాటు చేసిన బొమ్మల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తో చేయించారని,టెండర్ల వ్యవహారంలో రూల్స్ బ్రేక్ చేశారని,వీటన్నిటికీ ఆయనే బాధ్యుడని బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
దీనితో నా వెనుక సీఎం ఉన్నారని రమణా చారి అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడ్డాడు.అయినా ఇప్పటి వరకూ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.విసుగు చెందిన కౌన్సిలర్లు వీటికి సంబంధించిన ఆధారాలతో విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు కంప్లైంట్స్ చేయబోతున్నారని సమాచారం.కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం,కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావడం, కాంగ్రెస్ కౌన్సిలర్ల బలం పెరగడం రమణాచారి అవినీతిపై ఆధారాలతో సహా విజిలెన్స్ ఫిర్యాదు చేసేందుకు హస్తం కౌన్సిలర్లు సిద్ధమయ్యారనే సమాచారం అందుకున్న కమీషనర్ చెప్పా పెట్టకుండా రాజీనామా చేసి,రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఆగమేఘాల మీద జరిగిపోయాయి.
అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఎవరికీ తెలియకుండా పలాయనం చిత్తగించిన రమణాచారి స్థానంలో ఇంచార్జ్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వెంకటేశ్వర్లు పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.అవినీతిలో కూరుకుపోయి,అక్రమాల పుట్టగా మారిన నల్లగొండ మున్సిపాలిటీ నిర్వహణలో ఆయన ఎలా నెట్టుకొస్తారనే టాక్ నడుస్తోంది.