కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) అధినేత ఎన్.రంగసామి ప్రమాణ స్వీకారం చేశారు.
ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రంగసామితో ప్రమాణస్వీకారం చేయించారు.ఈ సందర్భంగా రంగసామి తమిళంలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు.కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
పుదుచ్చేరి సీఎంగా ప్రమాణం చేసిన రంగసామికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
పుదుచ్చేరి మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా ఆరుగురు సభ్యులు ఉండవచ్చు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.గతంలో ఇటువంటి సంప్రదాయం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో లేదు.
ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏ నమశ్శివాయంకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీనికోసం బీజేపీ అధిష్ఠానం నుంచి అనుమతి రావలసి ఉందని ఈ కూటమి వర్గాలు చెప్తున్నాయి.
ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను గెలుచుకుంది.
ఎన్ఆర్ కాంగ్రెస్ మిత్రపక్షం బీజేపీ 6చోట్ల విజయం సాధించింది.

పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా.ఎన్డీయే కూటమి 16 స్థానాలు సాధించింది.మరో ఆరుగురు స్వతంత్రులు సభకు ఎన్నికవగా వారంతా రంగసామి మద్దతుదారులే కావడం విశేషం.డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయగా ఆరు, కాంగ్రెస్ 14 స్థానాల్లో పోటీ చేయగా రెండింట విజయం సాధించింది.
రంగ స్వామి 2001లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.ఆ తర్వాత 2006లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.మంత్రివర్గ సహచరులతో భేదాభిప్రాయాలు రావడంతో 2008లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.