ఏపీలో రాజకీయాలు మళ్లీ వేడెక్కే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత టిడిపి ప్రభుత్వంలో కాపులను బీసీల్లో చేర్చాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు జరిగాయి.
అప్పట్లో ఈ వ్యవహారం ఏపీలో పెద్ద చర్చగా మారింది.తూర్పు గోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్సప్రెస్ తగలబెట్టడం వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి.
రాష్ట్రమంతా అతలాకుతలం అయింది.కాపులను బీసీల్లో చేర్చే వరకు తాము ఉద్యమం ఆపేది లేదని, చంద్రబాబు కాపులను బీసీల్లో చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేరేవరకు తాము వెనక్కి తగ్గమని అప్పట్లో పెద్ద హడావుడి నడిచింది.
ఇక ఆ ఉద్యమాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం కఠినంగానే అణిచివేసింది.ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర జగ్గంపేట, పత్తిపాడు లో పర్యటించిన సమయంలో జగన్ రిజర్వేషన్ అంశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాపులను బీసీల్లో చేరుస్తానని తాను హామీ ఇచ్చి చంద్రబాబు లా మోసం చేయలేను అని, ఇది కేంద్రం పరిధిలో అంశమని, కేంద్రం రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మద్దతు ఇస్తానని ప్రకటించారు.ఈ సందర్భంగా కాపులకు తగిన న్యాయం చేస్తామని, కార్పొరేషన్ నిధులను భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు.
అన్నట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది.జగన్ హామీ మేరకు కాపు కార్పొరేషన్ కు భారీగా నిధులు పెంచి కాపు నేస్తం పేరుతో ఆ సామాజిక వర్గం మహిళలకు లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించారు.
ఈ విషయంపై జనసేన అధినేత పవన్ గట్టిగానే ప్రభుత్వం నిలదీశారు.కాపులకు కావాల్సింది తాయిలాలు కాదని, రిజర్వేషన్ లు అని, ముందు వాటిని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇక ముద్రగడ కూడా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి జగన్ తన పెద్ద మనసు చాటుకోవాలని, మీ పదవి మూడునాళ్ళ ముచ్చటగా చేసుకోవద్దు అంటూ హెచ్చరికలు కూడా చేశారు.

ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో, ఇదే సరైన సమయంగా భావిస్తోన్న ముద్రగడ పద్మనాభం మరోసారి కాపు ఉద్యమాన్ని లేవదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎలాగూ వైసిపి ప్రభుత్వం రిజర్వేషన్ ల అంశం పై స్పందించే అవకాశం లేకపోవడంతో, భారీ ఎత్తున ఉద్యమం చేపట్టడం ద్వారా కేంద్రంలో కూడా కదలిక తీసుకురావాలని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించే వరకు ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని ముద్రగడ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, ఈ వ్యవహారం సద్దుమణిగిన తరువాత కాపు ఉద్యమం మొదలు పెట్టేందుకు ముద్రగడ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.