ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా, ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అంశం తో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ పేరు తెరపైకి వస్తూనే ఉంటుంది .ముఖ్యంగా టీడీపీ అనుకూల వ్యక్తిగా రాధాకృష్ణపై మిగతా పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి.
ముఖ్యంగా వైసిపి , ఆ పార్టీ అనుకూల మీడియా దీని పై కథనాలు ప్రచారం చేస్తూ ఉంటాయి.దీంతో ఆయనకు సంబంధించిన ప్రతి అంశం ఆసక్తికరంగానూ, వివాదాస్పదంగానూ మొదటినుంచి ఉంటూనే వస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా రాధాకృష్ణను ఉద్దేశించి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం సంచలనంగా మారింది.ఆ లేఖలో సంచలన ఆరోపణలు ముద్రగడ పద్మనాభం చేశారు.
పేద పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాల కోసమే తాను కాపు ఉద్యమం చేశానని, లక్షాధికారుడిని కోటీశ్వరుడిని చేయడానికి, కోటీశ్వరుడి ని అపర కుబేరుడు గా చేయడం కోసం కాదని ముద్రగడ లేఖలో ప్రస్తావించారు.రాధాకృష్ణ ఆలోచనలను అమలు చేయడానికి తాను అసమర్థుడని, చేతకాని వాడిని కాదని ముద్రగడ అన్నారు.
రాధాకృష్ణ లాగా ఎదుటి వాళ్ళని ఏకపక్షంగా మాట్లాడే పత్రికా యజమాని ఇంతవరకు చూడలేదు అన్నారు.ఆంధ్రజ్యోతి యజమాని కె ఎల్ ఎన్ ప్రసాద్ ను కుర్చీలోంచి కాళ్లు పట్టుకుని లాగి, ఆ కుర్చీలో కూర్చున్న ఘనత రాధా కృష్ణ ది అంటూ విమర్శించారు.
ఇటువంటి ఘనచరిత్ర మరే కుల నాయకులకు ఉండదని అన్నారు.

‘ నా చరిత్ర కంటే మీ చరిత్రను అందరూ చదవాలి.ఎందుకంటే మీలా అపర కోటీశ్వరులు అవ్వలేరు.నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలు దాచిన నల్లధనాన్ని బంగారు షాపుల యజమానులను బెదిరించి ఎలా చెలామణీ లోకి తెచ్చారో ? రెండు తలలు కలిసి పుట్టిన పిల్లలను విడదీయడానికి ఎలా డబ్బు సంపాదించాలో తెలిపే విధానాన్ని మీరు ప్రజలకు చెప్పాలి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెట్టింగ్ లను ప్రోత్సహించి ఎలా కోట్లు సంపాదించింది కూడా నేర్పాలి అంటూ అనేక వ్యంగ్య విమర్శలు చేస్తూ ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖనే రాయడం సంచలనంగా మారింది.ముద్రగడ లేఖకు రాధాకృష్ణ నుంచి ఏ స్థాయిలో రియాక్షన్ వస్తుంది అనేది రాజకీయంగాను ఆసక్తికరంగా మారింది.







