జగన్ కు బంధువుగా, వైసీపీలో కీలక నాయకుడుగా సినీ రంగానికి చెందిన మంచు మోహన్ బాబు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు.ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు నుంచి మోహన్ బాబు వైసీపీ కోసం పనిచేశారు.
ఆ సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు పైన విమర్శలతో మోహన్ బాబు విరుచుకుపడేవారు.వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు కీలక పదవిని జగన్ కట్టబెడతారని అంతా భావించారు .అయితే ఇప్పటి వరకు మోహన్ బాబు విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోలేదు .దీంతో చాలా కాలంగా ఆయన అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు.ఈ క్రమంలో ఆయన వైసీపీకి గుడ్ బాయ్ చెప్పే ఆలోచనను ఉన్నారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా జరుగుతోంది.
ఈ ప్రచారం ఇలా జరుగుతుండగానే , మోహన్ బాబు నిర్మించిన సాయిబాబా గుడి ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా టిడిపి అధినేత చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించడంతో అప్పటి నుంచి ఆయనపై పొలిటికల్ గా అనుమానాలు పెరిగాయి.
మోహన్ బాబు టిడిపిలో చేరబోతున్నారనే ప్రచారం తీవ్రతరం అయింది.దీని మరింత బలపరుస్తూ తాజాగా ప్రముఖ రాజకీయవేత్త, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాష్ రావు ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.
మోహన్ బాబు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి పోటీ చేస్తారంటూ గోనే ప్రకాష్ రావు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం సంచలనంగా మారింది.మోహన్ బాబు రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని, ఈ క్రమంలోనే ఆయన టిడిపిలో చేరి చంద్రగిరి నుంచి పోటీ చేస్తారని ప్రకాష్ రావు పేర్కొన్నారు.

గతంలో మోహన్ బాబు టిడిపిలోనే ఉండేవారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కు అండగా నిలబడుతూ వచ్చేవారు. చంద్రబాబుతోను సన్నిహితంగా మెలిగే వారు. ఆ తర్వాత క్రమంలో ఆయన చంద్రబాబుతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు.చంద్రగిరి నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. జగన్ కు అత్యంత సన్నిహితడిగా పేరుపొందారు.
ఈ నియోజకవర్గంలో చంద్రబాబు ఎమ్మెల్యే గా 1978లో గెలిచారు.ఆ తర్వాత 1983లో చంద్రబాబు ఓటమి చెందారు.
ఇక తర్వాత నుంచి కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంపిక చేసుకోవడంతో చంద్రగిరిలో బలమైన అభ్యర్థి అంటూ లేరు. ప్రస్తుతం అక్కడ టిడిపికి బలమైన నాయకుడు లేకపోవడంతో మోహన్ బాబు పార్టీలో చేరి ఆ సీటును కోరితే ఇచ్చేందుకు చంద్రబాబుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.