వరి ధాన్యం సేకరించేంత వరకు కేంద్రంపై పోరాటం కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తేల్చిచెప్పారు.ఢిల్లీలో సీఎం కేసిఆర్ అధ్వర్యంలో జరగిన తెరాస రైతు దీక్షలో పాల్గొని పలువురు జాతీయ, ప్రాంతీయ మీడియా ప్రతినిధులతో మంత్రి అజయ్ మాట్లాడారు.
తెలంగాణ రైతులు 300 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణ రైతుల పట్ల కక్షపూరితంగా ప్రవర్తిస్తుందన్నారు.
పంజాబ్, హర్యానాలో ధాన్యం సేకరించిన మాదిరిగానే తెలంగాణ నుంచి కూడా ఎఫ్‌సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఇదే అంశంపై నిరసనలు చేస్తున్నామని తెలంగాణ రైతులకు అండగా ఉంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ నాయకులకు రైతుల ఉసురు తగులుతుందని విమర్శించారు.
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని నేడు తెలంగాణ రైతులకోసం మళ్లీ రోడ్డెక్కామని ధర్నాపోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
కరెంట్ మీటర్‌ను మించి పెట్రో ధరలు పెరుగుతున్నాయని గత నెల రోజులుగా ప్రతిరోజూ చమురు ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.కేంద్ర సర్కారు ఎరువుల ధరలు పెంచి రైతుల ఉసురుపోసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్యాస్ మంటతో మళ్లీ ఉనుక పొయ్యిలు వాపస్ వస్తున్నాయని, మనం ముందుకు పోతున్నమా, వెనక్కు పోతున్నమా? అనేది తెలియట్లేదన్నారు.మన్ కీ బాత్ కాదు.
ముందు తమ రైతుల బాధలు వినాలని మోడీని డిమాండ్ చేశారు.రాజ్యాంగం ప్రకారం.
పండిన వడ్లు కొనే బాధ్యత కేంద్రానిదేనన్నారు.తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందేనని, వాటిని బాయిల్డ్ చేసుకుంటారా? నూకలు చేసుకుంటారా? సన్నబియ్యంగా మార్చుకుంటారా? అనేది కేంద్రం ఇష్టమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.