మార్కెట్లో గులాబీ తర్వాత చామంతి ( chamomile flower )పూలకే డిమాండ్ ఎక్కువ.ఎలాంటి శుభకార్యాలకైనా చామంతి పూలు ఉండాల్సిందే.
అయితే కొంతమంది రైతులు చామంతి పూల సాగులో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు.చామంతి పూల సాగులో మెళుకువలతో పాటు వేరు కుళ్ళు తెగుళ్లు ఆశిస్తే చామంతి పంటను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం.
చామంతి శీతాకాలంలో పుష్పించే మొక్క.పగటిపూట సమయం తక్కువ, రాత్రిపూట సమయం ఎక్కువగా ఉంటే చామంతి పంట త్వరగా పూతకు వస్తుంది.
చామంతి మొక్క నాటిన 100 రోజులకు చేతికి వస్తుంది కాబట్టి డిమాండ్, సీజన్ ను దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన విధంగా నాటుకోవాలి.
నీటిని సాధారణ పద్ధతిలో కాకుండా డ్రిప్ విధానం( Drip method ) ద్వారా అందిస్తే కలుపు సమస్య చాలా తక్కువగా ఉంటుంది.
ఒకటి లేదా రెండు సార్లు మొక్క మొదల వద్ద మట్టిని కదిలిస్తే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్క వద్ద నీరు నిల్వ ఉండదు.దీంతో వేరు కుళ్ళు తెగుళ్లు వచ్చే అవకాశం చాలా తక్కువ.

చామంతి మొక్కలు దాదాపుగా 30 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత మొక్కల తాళాలను తుంచాలి.ఇలా చేస్తే మొక్కకు పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి పూల దిగుబడి పెరుగుతుంది.మొక్క తలలు తుంచిన తర్వాత నత్రజని మరియు పొటాష్ ఎరువులను అందిస్తే నాణ్యమైన పూల దిగుబడి పొందవచ్చు.పూల పరిమాణం బాగా ఉండాలంటే ప్రతి 15 రోజులకు ఒకసారి రెండు గ్రాముల సుష్మధాతు మిశ్రమాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

చామంతి పంటకు తీవ్ర నష్టం కలిగించే వేరు కుళ్ళు తెగుళ్లు వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో పంటను ఆశిస్తుంది.ఈ తెగుళ్లు ఆశిస్తే మొక్కలు పాలిపోయి, ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.ఈ తెగుళ్లను గుర్తించిన తర్వాత ఆలస్యం చేయకుండా మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ ( Copper oxychloride )ను ఒక లీటర్ నీటిలో కలిపి చెట్టు మెడలు తడిచే విధంగా పోయాలి.లేదంటే రెండు గ్రాముల మెతలాక్సిల్ MZ ను ఒక లీటరు నీటిలో కలిపి చెట్టు మెడలు తడిచే విధంగా పోయాలి.