ఖమ్మం జిల్లా( Khammam District )లో నియోజకవర్గ స్తాయిలో ప్రభావం చూపగల నేతలలో ఒకరైన తుమ్మల ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు .బీఆరఎస్ కూడా తుమ్మల ను ఓడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న వేళ తన గెలుపు కి అంది వచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది .
దానిలో భాగంగానే తన పాత రాజకీయ సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఖమ్మం ఎస్సార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల( Thummala Nageswara Rao ) తనకు తెలుగుదేశం తో ఉన్న అనుబందాన్ని గుర్తి చేసి తెలుగు తమ్ములని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు .నాకు రాజకీయ జన్మనిచ్చిన దేవుడు ఎన్టీఆర్ అని ఆయన నా వెనుక ఉన్నారనే ధైర్యంతోనే పోటీ చేస్తున్నానంటూ టిడిపి క్యాడర్ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు.తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చింది తప్ప ఆ పార్టీపై కానీ ఆ పార్టీ అధినేతపై కానీ తన అభిమానం చెక్కుచెదరలేదంటూ చెప్పుకున్నారాయన.
తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల మరియు సానుభూతిపరుల ఓట్ల కోసం అన్ని పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి .ఆ కాంపౌండ్ నుంచేవచ్చిన నేత కావడంతో తనకు మరింత హక్కు ఉంటుందన్న కోణం లో తుమ్మల ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు గాలం వేస్తున్నారు .చిన్న వయసులోనే తనకు రాజకీయ ఓనమాలు నేర్పింది ఎన్టీఆర్ అని, అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికలలో తన గెలుపు కోసం తెలుగుదేశం ( TDP )కుటుంబ సహాయ పడాలంటూ చెప్పిన ఆయన తాను ఎప్పటికీ ఎన్టీఆర్కు రుణపడి ఉంటాను అంటూ ఆయన అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది .
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా బి ఆర్ఎస్ కు దక్కనివ్వమంటూ భీషణ ప్రతిజ్ఞ లు చేసిన కాంగ్రెస్ నేతలు ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలను అయితే ముమ్మరం చేశారు.మరి తెలుగుదేశం అభిమానుల మద్దతు తుమ్మలకు దక్కుతుందో లేదో వేచి చూడాలి.