అమెరికాలో గత కొన్ని రోజులుగా ఆసియా అమెరికన్లను టార్గెట్ చేసుకుని దుండగులు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.దీంతో ఆసియా సంతతి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
ఇప్పుడు ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌నే దుండగులు టార్గెట్ చేశారా అంటే అవుననే అంటున్నాయి కొన్ని ఘటనలు.వాషింగ్టన్ డీసీలోని కమలా హారీస్ అధికారిక నివాసం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ ఆగంతకుడిని భద్రతా సిబ్బంది బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
అతనిని తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు దొరికాయి.దుండగుడిని టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు చెందిన పాల్ ముర్రేగా గుర్తించారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అమెరికా ఉపాధ్యక్షురాలి ఇంటి వద్ద ఓ వ్యక్తి ఆయుధాలతో పట్టుబడటంతో సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది.ముర్రే వినియోగించిన వాహనంలో ఓ రైఫిల్, పేలుడు పదార్ధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదకర ఆయుధం, పేలుడు పదార్ధాలు కలిగి వున్నాడనే ఆరోపణ, కుట్ర తదితర సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ ఘటన జరిగిన బిల్డింగ్‌లో కమలా హారీస్ వుండటం లేదని అధికారులు వెల్లడించారు.
వైస్ ప్రెసిడెంట్ భవనంలో కొన్ని పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా, అమెరికాలో కరోనా వ్యాప్తికి ఆసియన్లే కారణమంటూ గత కొన్నిరోజులుగా కొందరు స్థానికులు ఆసియా సంతతి ప్రజలపై కాల్పులకు తెగబడుతున్నారు.
గడిచిన వారం రోజుల నుంచి ఈ తరహా ఘటనల్లో 15 మంది వరకు మరణించారు.మంగళవారం మూడు మసాజ్ పార్లర్లలో విచ్చలవిడిగా ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు.
వీరిలో ఆరుగురు ఆసియన్లే, అందులోనూ మహిళలు కావడం గమనార్హం.మృతుల్లో నలుగురు దక్షిణ కొరియా మహిళలు వున్నారు.
జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలోని రెండు పార్లర్లలో, అట్లాంటాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వుడ్‌స్టాక్‌లోని మరో పార్లర్‌లో మంగళవారం సాయంత్రం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న 21 ఏళ్ల రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా, ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారీస్ చరిత్ర సృష్టించారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో పలువురు భారతీయ సంతతి వ్యక్తులకు పదవులు దక్కిన విషయం తెలిసిందే
.