ఎక్కడ చూసినా లివింగ్ రిలేషన్ అని కామన్ గా చెప్తూ కలిసి ఉంటూ అవసరం లేదు అనుకుంటే విడిపోతూ ట్రెండ్ సెట్ చేస్తున్నాం అనుకుంటున్నారు కొంతమంది.అయితే కొన్ని దేశాలల్లో సహజీవనం చేయడానికి వీలు లేదు.
ఇక మన దేశంలో సంస్కృతికి విలువనిచ్చి ఇలాంటివి ఆలోచనల్లోకి కూడా రాలేదు ఒకప్పుడు.కానీ తరాలు మారుతున్న కొద్ది మనుషుల్లో వస్తున్న మార్పు వల్ల మన దేశంలో కూడా ఇప్పుడు లివింగ్ రిలేషన్ అనేది కామన్ అయిపోయింది పాశ్చ్యత్త విధానాలను అవలంభించేవారికి.
కానీ ఒక దేశం మాత్రం వీటిపై కఠినంగా వ్యవహరించాలి అనుకుంటుంది.కొన్ని పద్ధతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతుల విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన చట్టాలు, నిబంధనలు ఉంటాయనే విషయం తెలిసిందే.
అలాగే ఇండోనేషియా కూడా తమ పాత చట్టాల దుమ్ము దులిపి వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావాలనుకుంటోంది.ఇండోనేషియా తీసుకొస్తున్న కొత్త చట్టాల ప్రకారం ఆ దేశంలో ఇక పెళ్లికి ముందు శృంగారం నేరం కానుంది.
అవును.పెళ్లికి ముందు సహజీవనం చేసే అవకాశం లేకుండా ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్ తీసుకొస్తోంది.
అందుకోసం వివాహేతర సంబంధాలు, సహజీవనంపై ఇండోనేసియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.ఈ రెండింటినీ నిషేధిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు నిన్న పార్లమెంటు ఆమోదం తెలిపింది.
ఈ కొత్త చట్టం ప్రకారం వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తారు.ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు.
అలాగే, పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఆరు నెలల జైలు శిక్ష తప్పదు.ఈ కొత్త బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి.
బిల్లు ఆమోదం పొందిన అనంతరం న్యాయ, మానవహక్కుల మంత్రి యసొన్నా లాలోరి వీటి పై స్పందించారు.అనేకమంది అభిప్రాయాలు, కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
అయితే, ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంపై దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.వివాహేతర శృంగారంపై నిషేధం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారులు మండిపడుతున్నారు.
అయితే, ఇండోనేసియాకు వచ్చే విదేశీయులపై మాత్రం కొత్త చట్టం వర్తించదని అధికారులు చెబుతున్నారు.ఇండోనేసియా

లో ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉంది.ఇప్పటికే ఇక్కడ స్వలింగ సంపర్కంపై నిషేధం ఉంది.
మరోవైపు, ఈ కొత్తచట్టంపై అక్కడి హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
ఇది పౌర హక్కుల అణచివేత తప్ప మరోటి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కాగా, ఈ చట్టానికి ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆమోదం తెలపాల్సి ఉంది.
ఆయన ఆమోదం తెలిపిన మూడేళ్లకు ఈ చట్టం అమల్లోకి వస్తుంది.ఇస్లామిక్ వాదం ఎక్కువగా ఉండే ఇండోనేషియాలో ఈ కొత్త చట్టాలకు కొన్ని ఇస్లామిక్ సంస్థల మద్దతు బలంగా ఉంది.
అయితే, ఇంకొంతమంది మాత్రం ఈ బిల్లును బలంగా వ్యతిరేకిస్తున్నారు.సంప్రదాయ పోకడల పేరుతో పౌరుల స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేందుకు కుట్ర జరుగుతోందని ఈ బిల్లును వ్యతిరేకించిన వారు వాదిస్తున్నారు.1998 లో సుహార్తో నిరంకుశ పాలన అనంతరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న ఇండోనేషియన్ల స్వేచ్ఛకు మరోసారి భంగం కలిగించడమే అవుతుంది అనేది సదరు వర్గం వినిపిస్తోన్న వాదన.వాస్తవానికి 2019 లోనే ఇండోనేషియా సర్కారు ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చినప్పటికీ.
అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పదుల వేల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ప్రభుత్వానికి వెనక్కి తగ్గక తప్పలేదు.భారీ ఎత్తున ఆందోళనల మధ్య అప్పట్లో అలా అటకెక్కిన ఈ బిల్లును ఇండోనేషియా ప్రభుత్వం మరోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంతో ఇప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందింది.







