గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరింత దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది.నిన్నటి వరకు మంత్రిగా ఆయన కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
జగన్ క్యాబినెట్ లో కీలక మంత్రిగా ఆయనకు ప్రాధాన్యం ఉండేది.ఇప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసిన కొడాలి నాని కి అంతేస్థాయిలో ప్రాధాన్యం ఉండబోతోంది.
వైసీపీ ప్రభుత్వం పైన జగన్ పైన ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే నాని రంగంలోకి దిగిపోతూ తన నోటికి పని చెప్తూ ఉంటారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ తీవ్ర విమర్శలు చేయడంలో నాని ముందుంటారు.
తనకు మంత్రి పదవి అడ్డుగా ఉందని, ఆ పదవి లేకపోతే చంద్రబాబు లోకేష్ టిడిపి పై నా విశ్వరూపం చూపించే వాడినని అనేక సందర్భాల్లో చెప్పారు.నాని అన్నట్లుగానే ఇప్పుడు ఆయన మాజీ అయ్యారు.
కేవలం ఎమ్మెల్యే గానే ఉన్నారు.దీంతో పూర్తి స్థాయిలో లోకేష్ చంద్రబాబు పై నాని విమర్శలకు పదును పెట్టే అవకాశం ఉండబోతోంది.
మంత్రి పదవిని కోల్పోయాను అనే బాధ నాని లో ఎక్కడ కనిపించకపోగా, , టిడిపిని తన మాటలతో టార్గెట్ చేసేందుకు చక్కటి అవకాశం దక్కిందనే ఆనందం ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.కొడాలి నాని ఎంత గా విమర్శలు చేసినా, అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ గాని ప్రతి విమర్శలు చేసే సాహసం చేయలేని పరిస్థితి.
నాని మంత్రి పదవిని కోల్పోయినా, పార్టీలో కీలక పదవి అప్పగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న జగన్ టిడిపి, చంద్రబాబు ను టార్గెట్ చేసుకునేందుకు ఇప్పుడు కొడాలి నాని ని పూర్తి స్థాయిలో రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోంది.నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు నాని అస్త్రాన్ని జగన్ ఉపయోగించుకుంటున్నారు.ఇప్పుడు నాని కి మంత్రి పదవి లేకపోవడంతో ఇక చంద్రబాబు, లోకేష్ కు నాని చుక్కలు చూపిస్తారు అనడంలో సందేహమే లేదు.







