కొత్త బియ్యాన్ని వండేటప్పుడు కొంచెం ముద్దగా అవ్వటం సహజమే.అన్నం ముద్దగా కాకుండా పొడి పొడిగా రావాలంటే అన్నం ఉడికించే ముందు కొన్ని చుక్కలు నూనె వేయాలి.
మినప గారెలు చేసేటప్పుడు ఆ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ లేదా బియ్యం పిండి కలిపితే హోటల్ లో చేసే విధంగా క్రిస్పీగా వస్తాయి.
చపాతీలు మృదువుగా రావాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు రెండు స్పూన్ల నూనెను కలపాలి.
ఇలా నూనె వేసి కలపటం వలన చపాతీ కాల్చే సమయంలో నూనె వేయవలసిన అవసరం ఉండదు.
ఎండాకాలం వచ్చిందంటే వడియాలు పెడుతూ ఉంటాం.
ఆ వడియాల పిండిలో చిటికెడు వంట సోడా వేస్తె రుచిగా రావటమే కాకుండా బాగా పొంగుతాయి.
బొంబాయి రవ్వను వేగించి నిల్వ చేసుకుంటే పురుగు పట్టదు.
అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పచ్చిమిర్చి ముచ్చికలను తీసి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
పూరీలు చేసినప్పుడు అరకేజీ గోధుమ పిండిలో ఒక గరెట మైదా పిండిని కలిపితే పూరీలు బాగా పొంగటమే కాకూండా బాగా క్రిస్పీగా వస్తాయి.
ధనియాలను వేగించి చల్లార్చి డబ్బాలో నిల్వ చేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
రసం పిండేసిన నిమ్మ బద్దలను పాడేయకుండా ఫ్రిడ్జ్ లో ఒక మూల పెడితే ఫ్రిడ్జ్ లో దుర్వాసనలు రావు.అలాగే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు తాజా వాసన వస్తుంది.