తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేసిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.కల్వకుంట్ల రాజకీయ నేపద్యము తెలిసిన వారందరికీ ఈ విషయం సుపరిచితమే.
అదేవిధంగా ఎన్ని అవంతరాలు ఎదురైనా తాను అనుకున్నది సాధించినంత వరకు కేసీఆర్ కథనరంగం నుంచి నిష్క్రమించరని కచ్చితంగా చెప్పవచ్చు.కేసీఆర్ ఉద్యమ నేపథ్యం పరిశీలిస్తే సామాన్య మానవునికి సైతం ఈ విషయం అర్ధమవుతుంది.
సహజంగా ప్రతి రాజకీయ నాయకుడు అవకాశాల కొరకు ఎదురు చూస్తూ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.కేసీఆర్ మాత్రం అవకాశాలను తానే సృష్టించుకుని తాను అనుకున్నదానిని అందిపుచ్చుకుంటారని అతని రాజకీయ చతురత పలుమార్లు తేటతెల్లం చేసింది.
దేశ రాజకీయాలలో ప్రభావం ఎలా ఉన్నా కె.సి.ఆర్ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించబోయే వ్యూహం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అని వార్తలు రావడం గమనార్హం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కులాలు ముఖ్య భూమిక పోషిస్తాయి.
కొద్దికాలం మినహాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 1956 వ సంవత్సరం నుండి నేటి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గాలే పరిపాలిస్టున్నాయి.ఆ రెండు సామాజిక వర్గాలే రాష్ట్రంపై పెత్తనం చేస్తున్నాయి.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్డి,కమ్మ సామాజిక వర్గాల రెండింటికి లోపాయకారి ఒప్పందం ఉన్నట్లుగా రాష్ట్ర రాజకీయాలలో ఇతర సామాజిక వర్గాలను ఎదగనీయకుండా ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తుంటాయి.అభిమానుల బలం మెండుగా ఉండి, అత్యధిక జనాకర్షణ కలిగి, రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్నకాపు కులానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో 2009 లో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ కనుమరుగు అయిన వైనమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
దీని వలన దశాబ్దాలుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని 52 శాతం పైగా ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన వారు అన్నిరకాలుగా నష్టపోతున్నారు అనేది నిర్వివాదాంశం.ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జీవన ప్రమాణాలతో నామామాత్ర ఎదుగుదల లేని జాతులు ఏవైనా ఉన్నాయంటే అవి రాష్ట్రంలోని 136 బి.సి.కులాలే అని కచ్చితంగా చెప్పవచ్చు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో బి.సి లను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల్లో ఉపయోగపడే ఓటర్లుగానే చూస్తున్నారు.సుమారు నాలుగు దశాబ్దాలుగా బి.సి ల ఓట్లతో మనుగడ సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ వలన కూడా బి.సీల జీవన ప్రమాణాలు పెరగక పోవడం శోచనీయం.తెలుగుదేశం పార్టీ వలన కేవలం మూడు కుటుంబాలే బి.సి లలో బాగుపడ్డారు.అందువల్లనే 2019 ఎన్నికల్లో బి.సి లు అధిక భాగం వై.యస్.ఆర్.సి.పార్టీ వైపు మొగ్గు చూపారు.వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బి.సీలకు రాజకీయంగా కొన్ని నామినేటెడ్ పదవులైతే కేటాయించింది కానీ బి.సి ల జీవన ప్రమాణాలు పెరిగేయందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం.నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్షుణ్ణంగా తెలిసిన కె.సి.ఆర్ బి.సి ల ప్రాధాన్యంతో త్వరలో తాను స్థాపించబోయే జాతీయ పార్టీని ఆంద్రప్రదేశ్ లో విస్తరింప చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది మంత్రులకు మరియు అనేక మంది ప్రజాప్రతినిధులకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలలోని ముఖ్య నేతలతో దగ్గరి బంధుత్వాలు ఉన్నాయి.అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోని కె.సి.ఆర్ పాత మిత్రులు ఆపార్టీ పై అసంతృప్తితో ఉన్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక మంది నేతలు టి.ఆర్.యస్ ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ అనేక రకాల పనులు చేపించుకుంటున్నారు.ఇవన్నీ ఆంద్రప్రదేశ్ లో కల్వకుంట్ల పార్టీకి కలిసి వచ్చే అంశాలు.కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను స్థాపించబోయే జాతీయ పార్టీకి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, యంఐయం.పార్టీ, బియస్పి మరియు కలిసివచ్చే అన్ని పార్టీల మద్దతు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.బి.సి ల ప్రాధాన్యతతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయాలని చూస్తున్నకె.సి.ఆర్ కు బి.సీ లతో పాటూ రెడ్డి,కమ్మ సామాజిక వర్గాల పాలనతో విసిగి వేసారిన అన్నివర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం పుష్కలంగా ఉంది.అదేసమయంలో ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించిన వైనం కె.సి.ఆర్ కు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తిగతంగా లక్షలాది మంది ఆభిమానులను సంపాదించి పెట్టింది.ప్రధాని మోదీతో పాటూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవన నిర్మాణ శంకుస్థాపనకు కె.సి.ఆర్ వచ్చినపుడు కె.సి.ఆర్ స్టేజ్ పై కనిపించిన వెంటనే ఆంద్రప్రదేశ్ ప్రజలు స్పందించిన తీరే దీనికి నిదర్శనం.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు మరియు కె.సి.ఆర్ కు ఉన్న వ్యక్తిగత పరిచయాలు,అభిమానులు పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కె.సి.ఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ మనుగడ ఆంద్రప్రదేశ్ లో నల్లేరుమీద నడకగానే భావింపవచ్చు.అదేసమయంలో కె.సి.ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పలు సంచలనాలకు కేంద్రబిందువు గా మారే పరిస్థితి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.ఆరున్నర దశాబ్దాలుగా ఆ రెండు సామాజిక వర్గాల పాలనతో దగా పడుతున్న ప్రతి ఆంధ్రుడూ కె.సి.ఆర్ కు ఆల్ ది బెస్ట్ చెపుదాం.