యాదాద్రి భువనగిరి జిల్లా:ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర రైతుల శాపం తగులుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆదివారం ఆలేరు నియోజకవర్గం గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ మాట-ముచ్చట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గుండాల మండలాన్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని,ఈసారి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,అందరం కలిసికట్టుగా మన పార్టీని గెలిపించుకుందామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అన్నింటా ఫెయిల్ అయిందని,పరీక్షలు జరిపించడం రాదు,పేపర్లు దిద్దడం రాదని ఎద్దేవా చేశారు.నియోజకవర్గాల్లో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, పలు కారణాలతో కొందరు చనిపోతే వారి కుటుంబ సభ్యులను పలకరించని ఎమ్మెల్యేలు,మంత్రులు అవసరమా? కనీసం పలకరించాలన్న మానవత్వం లేదా? అని అవేదన వ్యక్తం చేశారు.15 రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు.ఇప్పటికీ చాలా చోట్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి.
వర్షాలకు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్లపాలు అవుతోందని, అన్నదాతలు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు.గుండాలకు దగ్గరలో ఉన్న ధాన్యం కొనుగోలు సెంటర్ లో వర్షాలకు పంటంతా తడిసిపోతోందని,ఉదయం పటేల్ గూడెం వెళితే అక్కడ కూడా ధాన్యం తడిసిపోయిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో చేతగాని మంత్రులు ఉన్నారని,రైతుల పక్షాన చేతులెత్తి దండం పెడుతున్నా భారత్ రాష్ట్ర సమితి కాదు,ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టినా మాకు అభ్యంతరం లేదు.కానీ,వడ్ల సంగతి తేలాలని కష్టపడి రైతులు పంట పండిస్తే కొనుగోళ్ల జాప్యం కారణంగా వర్షం పాలవుతోందన్నారు.
ఔరంగాబాద్ కాదు కేసీఆర్ ఓసారి పక్కనే ఉన్న ఛత్తీస్ గఢ్ వెళ్లిరా,అక్కడ మార్కెట్ లోకి వచ్చిన 24 గంటల్లోనే క్వింటాల్ ధాన్యం రూ.3వేల కొనుగోలు చేస్తున్నారు.వెళ్లి ఓసారి చూసిరండి.ఇది నిజం కానట్టయితే నా పదవికి రాజీనామా చేస్తా, నిజమైతే నీ మంత్రి చేత రాజీనామా చేయించు అని నువ్వు ఎలాగూ రాజీనామా చెయ్యవని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చత్తీస్ గఢ్ లో క్వింటాల్ వడ్లు 3 వేల రూపాయలతో కొంటుంటే కాంగ్రెస్ పార్టీని తిడతావా? రైతు సోదరులారా దీన్ని గమనించండని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందిస్తామని హామీ ఇస్తున్నానని,ఏక కాలంలోనే రుణమాఫీ చేస్తేనే రైతుకు ఉపయోగం ఉంటుందని,గతంలో మా పాలనలో అది చేసి చూపించామన్నారు.
కేసీఆర్ చేసే కొద్ది కొద్ది రుణమాఫీ వల్ల ఉపయోగం లేదని,బ్యాంక్ వాళ్లు వడ్డీ కింద జమచేసుకుంటున్నారని అన్నారు.భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర రంగారెడ్డి,భువనగిరి, నల్గొండ మీదుగా ఖమ్మం వెళ్తుందని,ఆలేరులో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.4 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఈసారి ప్రజలు మావైపే ఉన్నారన్న నమ్మకం ఉందన్నారు.మా ప్రభుత్వం రాగానే క్వింటాల్ ధాన్యాన్ని 3 వేల రూపాయలకు కొంటామని పునరుద్ఘాటించారు.