తెలంగాణ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించాలని సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ఆర్ టి పి అధ్యక్షురాలు షర్మిల( YS sharmila ) అధికార బి ఆర్ఎస్ నేతలే లక్ష్యం గా అనేకసార్లు తన పాదయాత్ర లలో విమర్శలు వర్షం కురిపించేవారు . కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ లోని కీలక నేతలను చీల్చి చెండాడే విధంగా మాటల తూటాలు పేల్చే వారు .
అయినా కూడా ఎప్పుడూ షర్మిల మాటలకు కేసీఆర్( CM KCR ) బదులిచ్చిన సందర్భం ఎప్పుడూ ఎదురవ్వలేదు .అసలు షర్మిల పేరు తీయడానికి కూడా ఆయన ఇష్టపడనట్టుగా వ్యవహారం ఉండేది .అయితే మారిన సమీకరణాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అంది వచ్చిన ప్రతి గడ్డిపోచని అస్త్రం గా ప్రయోగించాలని చూస్తున్న కేసీఆర్ మొదటిసారి షర్మిల పేరును ఎత్తుకున్నారు.
నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ చరిత్రలో నర్సంపేటకు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, సమైక్యవాదులు వాళ్ళ చెంచాలు మనమీద పెత్తనం చెలాయించాలనుకున్నప్పుడు సుదర్శన్ రెడ్డి నిరసన తెలిపారని, దాంతో సుదర్శన్ రెడ్డి ( Sudarshan Reddy )మీద షర్మిల పగ పట్టిందట, డబ్బు కట్టలు పంపించి ఓడించాలని చూస్తుందని, డబ్బు కట్టలు గెలుస్తాయో? మిషన్ భగీరథ నీళ్లు గెలస్తాయో నర్సంపేట ప్రజలు చెప్పాలంటూ కేసిఆర్ వాఖ్యానించారు.
పరాయి రాష్ట్రం వాళ్ళు డబ్బు సంచులు పంపితే మనం ఓడిపోతామా అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు .సుదర్శన్ రెడ్డి ప్రజల మనిషని, ఎప్పుడూ తన నర్సంపేట నియోజకవర్గం గురించే ఆలోచిస్తారని, హైదరాబాద్కు ఆయన రావడమే తక్కువని, వచ్చినా కూడా తన నియోజకవర్గం గురించే మాట్లాడుతారని ఆయన నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆ అభివృద్ధి కొనసాగాలి అంటే ఆయనను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందంటూ ఆయన నర్సంపేట ప్రజలను కోరారు.ఏది ఏమైనా ఇంతకాలం షర్మిళ ది తన స్థాయి కాదన్నట్లుగా కనీసం పేరు పలకడానికి కూడా ఆసక్తి చూపని కేసీఆర్ ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ఆంధ్ర ప్రాంతపు సమీకరణం తీసుకురావడం కోసమే షర్మిల పేరు ఎత్తకున్నట్లుగా తెలుస్తుంది.మరి కెసిఆర్ ఎత్తుకున్న అస్త్రం పనిచేస్తుందో లేదో చూడాలి.