నాగార్జునా సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెలాఖరులో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ ఓ స్పష్టతకు వచ్చేశారనే అంటున్నారు.దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబీకులకే టికెట్ ఇస్తారని, ఆయన కుమారుడు భగత్‌కు పోటీచేసే అవకాశం ఉందని మొదట్లో ప్రచారం జరిగింది.
భగత్‌తో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, స్థానిక నేత కోటిరెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.అయితే వీరికి షాక్ తప్పదనే అంటున్నారు.
అయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి బరిలో ఉండే అవకాశం ఉండడంతో పాటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోనుండడంతో కేసీఆర్ అభ్యర్థి ఖరారు విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేస్తున్నారు.
ఇప్పటికే కేసీఆర్ నియోజకవర్గంలో హాలియా, సాగర్ మున్సిపాల్టీలతో పాటు నియోజకవర్గంలో అన్ని మండలాల కు పార్టీ ముఖ్య నేతలను ఇన్ చార్జ్ లుగా నియమించేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మూడు నెలలుగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితిపై కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నారు.ఇక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ మకాం వేయనున్నారు.
అప్పుడు గ్రామాల వారీగా కూడా ఎమ్మెల్యేలను దింపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

ఇక సాగర్లో అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ యాదవులకే సీటు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది.ఇక్కడ రెడ్ల కంటే కూడా యాదవ వర్గం ఓటర్లే ఎక్కువ.నోముల కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తే.
అయితే నోముల కుమారుడు భగత్‌పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ వర్గం నుంచే మరి కొందరి పేర్లు లైన్లో ఉన్నాయి.యాదవ సామాజికవర్గానికి చెందిన మన్నె రంజిత్ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్, కట్టెబోయిన గురువయ్య యాదవ్ లలో ఎవరో ఒకరికి సీటు ఇస్తే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.మరి ఏం జరుగుతుందో ? చూడాలి.