ఒకపక్క మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల వ్యవహారం లో నాయకులు , ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా అంతా బిజీగా ఉండగానే.టిఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని, ఓ నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్లు చొప్పున ఇచ్చేందుకు కూడా సిద్ధమైందనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.
అయితే ఆ డీల్ పూర్తికాకముందే ఆ విషయం బయటకు రావడంతో, నానా హడావుడి మొదలైంది.అయితే తాము టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటంటూ బిజెపి ఎదురుదాడి చేసింది.
అయితే ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ అంత దూకుడుగా అయితే విమర్శలు చేయడం లేదు.ముఖ్యంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు .ఈ వ్యవహారం కోర్టులో ఉందని, పార్టీ నాయకులు ఎవరు ఈ విషయంపై మీడియా ముందు మాట్లాడవద్దు అంటూ కేటీఆర్ సూచించారు.టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు ఈ వ్యవహారంలో ఉన్నట్లుగా తేలింది.ఇదిలా ఉంటే ఈ ఎమ్మెల్యే లతో పాటు, టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్, హరీష్ రావు, తదితరులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయిలో నివేదికను ఈ సందర్భంగా తయారు చేసినట్లు సమాచారం.

దీనికి సంబంధించి నిన్న కేసీఆర్ మీడియా ముందు కు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగినా, కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు.ఈ వ్యవహారాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు అని ఢిల్లీలోనే ఈ వ్యవహారంపై స్పందించాలని, దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని చర్చగా మార్చాలని , ఈ విధంగా బిజెపిని మరింత టార్గెట్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.అందుకే ఈ ఘటనకు సంబంధించి పక్క ఆధారాలను సంపాదించి వాటిని ప్రస్తావిస్తూ మీడియా ముందుకు కేసిఆర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయంశం కావడంతో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్ కు ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరా తీసినట్లు టిఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.







