ఎట్టకేలకు సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ( JD VV Lakshminarayana ) కొత్త పార్టీని స్థాపించారు.తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారనే హడావుడి జరిగినా, దానికి సంబంధించిన కసరత్తు ఆయన చేసినా, చివరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని అప్పట్లో జనసేన పార్టీలో చేరారు.
విశాఖపట్నం నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీగా ఆయన పోటీ చేశారు.అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం, తర్వాత జనసేనలో ఆయన ఇమడలేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.
చాలా కాలంగా విశాఖ వేదికగా ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు.ఇక తరువాత ఆయన ఏపీ బీఆర్ఎస్( AP BRS ) అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నారనే ప్రచారం జరిగింది.
కానీ అవన్నీ వట్టి పుకార్లేనని తర్వాత తేలింది.తాజాగా ఆయన జై భారత్ నేషనల్ అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడిన సమయంలో, లక్ష్మీనారాయణ స్థాపించిన పార్టీ ఏ పార్టీని దెబ్బతీయబోతోంది అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.లక్ష్మీనారాయణ నీతి, నిజాయితీగల అధికారిగా పేరు పొందడం, ఆయనకు ఇప్పటి వరకు జనాల్లో క్లిన్ ఇమేజ్ ఉండడంతో, ఆ పార్టీ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఉండబోతుందనే విషయం అర్థమవుతుంది.అయితే ముఖ్యంగా జై భారత్ పార్టీ( Jai Bharat Party ) ప్రభావం జనసేన పార్టీ పై పడబోతుందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి.
దీనికి కారణం జనసేన, తెలుగుదేశం పార్టీతో( Janasena , Telugu Desam Party ) పొత్తు పెట్టుకోవడం, ఇప్పటికి జనసేన నాయకులు చాలామందికి ఈ పొత్తు ఇష్టం లేకపోవడం, గతంలో టిడిపి, చంద్రబాబు వైఖరిని వారు గుర్తు చేసుకుంటూ పవన్ పైన ఒత్తిడి చేస్తున్నారు.ఇటీవల పవన్ పదేళ్ల పాటు టీడీపీతో పొత్తు ఆవశ్యకతను గురించి వివరించడం, ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని ప్రకటించడం, దీనికి తగ్గట్లుగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని, ఇందులో డౌట్ లేదని , పవన్ కూడా అనుభవం ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు .ఈ నేపథ్యంలో జనసేన లోని అసంతృప్త నాయకులు జై భారత్ పార్టీ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.