గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) లను అందజేయలేక పోతుందని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.పీపీఈ కిట్లు లేకపోవడంతో ఫ్రంట్ లైన్ వారియర్లు రెయిన్ కోట్లను ధరించి రోగులకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో వేల కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని అన్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాల్సి ఉండగా, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
కనీసం గ్లౌజులు కూడా సమకూర్చలేని స్ధితిలో వైద్య ఆరోగ్య శాఖ ఉందని తెలిపిన నర్సింగ్ సిబ్బంది వారి ఆవేదనను తెలుసుకుంటే చాలా బాధ కలిగిందని నాదెండ్ల మనోహర్ వాపోయారు.గ్లౌజులు, శానిటైజర్లు సొంత డబ్బులతో కొనుగోలు చేసుకుంటున్నట్లు నర్సింగ్ సిబ్బంది వెల్లడించారని అన్నారు.
ఆస్పత్రిలో కనీసం ఫార్మసిస్ట్ కూడా లేరని నాదెండ్ల మనోహర్ అన్నారు.తెనాలి ఆస్పత్రిలో చాలినంత వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతోందని అన్నారు.
దీంతో రోగులకు నాణ్యమైన వైద్య సహాయం అందకపోయే ప్రమాదం ఉందని అన్నారు.ఆస్పత్రుల్లో వెంటనే మౌలిక సదుపాయాలను కల్పించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.