జనసేన బిజెపి ల మధ్య ఉన్న పొత్తు విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.రెండు పార్టీలు ఇప్పటి వరకు పొత్తు కొనసాగిస్తూ వచ్చినా, ఇక అనధికారికంగా ఆ పొత్తు రద్దయినట్లే.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.బిజెపితో ఇక లాభం లేదని, తనకు సరైన రూట్ మ్యాప్ ఇవ్వలేదని, అందుకే తాను సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పవన్ చేసిన వ్యాఖ్యలతో ఇక రెండు పార్టీల మధ్య పొత్తు అనేది లేదు అనే విషయం అందరికీ అర్థమయిపోయింది.
అయితే జనసేనను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందంటూ బిజెపి కీలక నాయకుడు , మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కర్ణ లక్ష్మీనారాయణ సంచలన విమర్శలు చేశారు.అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదని, కోర్ కమిటీ సమావేశంలోనూ ఏ అంశం చర్చకు రావడంలేదని, సోమ వీర్రాజు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కన్నా తన అసంతృప్తిని బయటపెట్టారు .ఈ పరిణామాల మధ్య సోమ వీర్రాజు ఢిల్లీ వెళ్లడం సంచలనం రేపింది .ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మీడియా సమావేశం నిర్వహిస్తారని అంతా భావించినా, ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు.ఇక 2024 ఎన్నికల్లోను సోమ వీర్రాజు ఆధ్వర్యంలోనే ఏపీ బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో , కన్నా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం.

ఒక దశలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతారని ప్రచారం జరిగినా, ఆ విషయాన్ని ఆయన ఖండించారు.తాను బిజెపిలో చేరినప్పటి నుంచి ఇదే రకమైన ప్రచారం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ తో సమన్వయ లోపం ఉందనే విషయాన్ని బిజెపి అధిష్టానం ఎప్పుడో గుర్తించిందని, అందుకే ఆ బాధ్యతలను తమ పార్టీ జాతీయ నాయకుడు మురళీధరన్ కు అప్పగించిందని విషయాన్ని కన్నా హైలెట్ చేస్తున్నారు.
ఎప్పటి నుంచో సోమ వీర్రాజు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉంటూ వచ్చిన కన్నా… ఇప్పుడు ఆయనపై విమర్శలు చేసేందుకు సరైన సమయంగా భావించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది.అయితే కన్నా మొదటి నుంచి టిడిపికి అనుకూలంగా వ్యవహరించే వారు.
అప్పట్లో టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం తో ఉన్న బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణ ను బిజెపి అధ్యక్షుడిగా తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలను అప్పగించింది.అప్పటి నుంచి ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
మళ్ళీ ఇప్పుడు జనసేన వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత రాష్ట్ర బిజెపి నాయకత్వంపై విమర్శలు చేస్తూ యాక్టివ్ అయ్యారు.







