వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు పగడ్బందిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎక్కడా ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ఆరాతీస్తున్నారు. వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ,మంత్రుల పనితీరు పైన నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రిపోర్టులు తెప్పించుకున్న జగన్ దాంట్లో పనితీరు సక్రమంగా లేని వారికి వార్నింగ్ లు ఇచ్చారు.

వారికి మరో అవకాశాన్ని కూడా ఇచ్చారు.ఈ డిసెంబర్ లోగా పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని.గెలుస్తారు అనుకున్న వారికే టికెట్ ఇస్తానని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే 25 సంవత్సరాల పాటు పార్టీకి తిరుగుండదని జగన్ చెబుతూనే వస్తున్నారు.
తాజాగా మరోసారి ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం తమ సర్వే నివేదికను జగన్ కు అందించింది.దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా ప్రస్తావించారట.
ముఖ్యంగా గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నా, కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు తూతు మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం వంటి వాటిపైన జగన్ కు రిపోర్టులు అందాయట.తాజాగా అందిన రిపోర్ట్ అంశాన్ని ఈరోజు జరగబోయే పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే గృహసారధులు, కోఆర్డినేటర్ల నియామకం ముగిసింది .నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలకు ఆ జాబితాలు చేరాయి.పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల్లో వెంటనే వాటిని పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి.ఇప్పుడు జరగబోయే సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు కాబట్టి పనితీరు సక్రమంగా లేని వారి వివరాలను జగన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
అలాగే పీకే టీం ఇచ్చిన నివేదితను బయటపెట్టి మరింత అలర్ట్ గా ఉండాలని సూచనలతో కూడిన హెచ్చరికలు చేయబోతున్నారట.ఇక కొత్తగా నియామకమైన గృహసారథులు , కోఆర్డినేటర్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు శిక్షణ తరగతులను నిర్వహించబోతున్నారు.
మొత్తంగా చూస్తే పార్టీ వ్యవహారాలపై జగన్ సీరియస్ గానే దృష్టి పెట్టినట్లుగా అర్థం అవుతోంది.








