ఏపీ అధికార పార్టీ వైసీపీ కి ప్రధాన ప్రతిపక్షం గా తెలుగుదేశం పార్టీ ఉన్నా, ఆ పార్టీ నామమాత్రమేనని, తానే ప్రధాన ప్రతిపక్షం అన్నట్లుగా వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు.ప్రతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చికాకు కలిగిస్తూ వస్తున్నారు.
ఢిల్లీ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పరువు మొత్తం తీస్తున్నారనే బాధ జగన్ లో ఎక్కువగా ఉంది.అందుకే ఆయనపై అనర్హత వేటు వేయించి, పార్టీ గురించి ఏ విధమైన కామెంట్లు చేయకుండా కట్టడి చేసేందుకు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ భేటీ అయ్యారు.
అయినా రఘురామకృష్ణంరాజు రోజుకు ఏదో ఒక సమస్య ఎత్తి చూపుతూ, ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉన్నారు.ఈయన వ్యవహారం ఇలా ఉంది అనుకుంటే, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ నాయకుడు, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అదే పనిగా జగన్ పైన, వైసీపీ పైన విమర్శలు చేస్తూ ఇబ్బందికరంగా మారారు.
కొద్ది నెలల క్రితం వైఎస్ విజయమ్మ నాలో నాతో వైయస్సార్ అనే ఈ పుస్తకాన్ని రాశారు అందులో వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, అనేక అంశాలను పుస్తకంలో వివరించారు.అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర లో జగన్ ఉన్నాడు అంటూ రాసిన అంశాన్ని ఇప్పుడు గోనె ప్రకాష్ రావు తప్పు పడుతున్నారు.
అసలు రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర లో జగన్ లేడు అని, ఒక్క రోజు కూడా ఆయన పాల్గొనలేదని , ఈ విషయం అంబటి రాంబాబు, లగడపాటి రాజగోపాల్, భూమన కరుణాకర్ రెడ్డి లకు బాగా తెలుసునన్నారు.

జగన్ ఉన్నాడు అని నిరూపిస్తే తాను ఉరేసుకుంటాను అంటూ గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీకి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇలా అసత్యాలు మాట్లాడడం తగదు అంటూ చురకలు అంటించారు.ఇదే కాదు టీవీ డిబేట్ లలోనూ అదేపనిగా గోనె ప్రకాష్ రావు జగన్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు మరో తలపోటుగా మారాయి.
ఒక పక్క రఘురామ, మరో పక్క గోనె ప్రకాష్ రావు ఇద్దరి వ్యవహారాల నుంచి ఎలా బయటపడాలో తెలియక వైసీపీ ఆందోళనలో ఉంది.