ఏపీ రాజకీయాలను చాలా నిశితంగా నే పరిశీలిస్తున్నారు.వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్.
తరచుగా తనపైన, తమ ప్రభుత్వం పైన , పార్టీ పైన విమర్శలు చేస్తూ ప్రజల్లో చులకన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారందరి వ్యవహారాలను తేల్చే పనుల్లో ఉన్నారు.ఇప్పటికే టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంను టార్గెట్ చేసుకున్నారు.
అక్కడ వైసిపి బలం పెరిగేలా చేశారు.రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి తనం పంతం నెగ్గించుకోవాలనే లక్ష్యంతో జగన్ ఉంటూ వచ్చారు.
అయితే చంద్రబాబు కంటే ఎక్కువగా తనను ఇరిటేట్ చేస్తూ తరుచుగా విమర్శలు చేస్తూ ఇబ్బందికరంగా మారిన టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకుండా చేయాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు కి గట్టిపట్టు ఉంది.ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమా శంకర్ గణేష్ చేతిలో 34 వేల ఓట్లు తేడాతో అయ్యన్న ఓటమి చెందారు.అయితే 2024 ఎన్నికల్లో అయినను ఓడించడం అంత సులువేమీ కాదని, అంతేకాకుండా వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉమా శంకర్ పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం రాబోయే ఎన్నికల్లో గెలుపు కష్టమనే రిపోర్టులు అందడంతో అక్కడ బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట.
చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా అయ్యన్నను మాత్రం ఓడించాలని జగన్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారట.

ఇప్పటికే అయ్యన్న పై అనేక కేసులు నమోదైనా, ఆయన బెయిల్ పై వచ్చి మరి యధావిధిగా విమర్శలు చేస్తున్నారు.కుమారుడు చింతకాయల విజయ్ టిడిపి సోషల్ మీడియా విభాగాన్ని నడిపిస్తున్నారు.ఆయన పైన కేసులు ఉన్నాయి.
అయినా అయ్యన్న మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం, రోజురోజుకు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతుండడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట.







