జగన్ మంచోడే కానీ అంటూ ఏదో సాగదీస్తారు.పోనీ పార్టీలో కుదురుగా ఉంటారా అంటే ఉండరు.
పోనీ వేరే ఏదైనా పార్టీలో చేరతారా అంటే అదీ చేయరు.వైసీపీలోనే ఉంటూనే, ఆ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కంటిలో నలుసుగా మారిపోయారు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు.
అసలు ఎందుకు ఉన్న పళంగా విమర్శలు చేస్తున్నారో ? పార్టీకి రాజీనామా చేయకుండానే సొంత పార్టీలోనే ప్రతిపక్షంగా ఎందుకు మారారో ఇప్పటికీ అర్ధం కావడంలేదు.అలా అని రాజు గారిపై వైసీపీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే అదీ లేదు.
తెలుగుదేశం పార్టీతో సమానంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు రఘురామకృష్ణం రాజు.కొద్ది రోజులుగా ఈయన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేక వైసీపీ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.
వైసీపీలో రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూనే వస్తోంది జగన్ ను ఆయన నేరుగా విమర్శించకుండా, పార్టీపై, పార్టీ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు.అంతేకాకుండా ఏపీలో తెలుగుదేశం పార్టీ ని మించి వైసీపీ రాజకీయ ప్రత్యర్థిలా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాజుగారు టీడీపీ కంటే ముందుగానే స్పందించి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత టీడీపీ కూడా ఆ రాగం అందుకుని తమ ఫోన్ లు కూడా ట్యాపింగ్ అవుతున్నట్టుగా తెలిపింది.ఇక వినాయక చవితి మండపాల పర్మిషన్ ల దగ్గర నుంచి ఏ వ్యవహారాన్నీ వదిలిపెట్టకుండా, రఘు రామకృష్ణంరాజు వైసీపీ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి వంటి వారు భేటీ అవ్వడం, దానికి సంబంధించిన అనేక విమర్శలు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేయడం, ఈ వ్యవహారాలపైన రఘురామకృష్ణరాజు స్పందించి విమర్శలు చేశారు.ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే, పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఫోన్ సంభాషణ గురించి ఆయనకు ఎలా తెలుస్తోంది అంటూ ఎదురు ప్రశ్నించి వైసీపీ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టారు.
అసలు జగన్ చాలా మంచి వ్యక్తని, ఆయనను తాను విమర్శించడం లేదని, పార్టీ లోని లోపాలను మాత్రమే ఎత్తిచూపిస్తున్నాను అంటూ రఘురామకృష్ణరాజు చెబుతూనే, విజయసాయి రెడ్డి దీనంతటికీ కారణం అంటూ, ఆయనని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.

అసలు తాను జగన్ బొమ్మతోనే గెలవలేదని చెబుతూనే, జగన్ అంటే తనకు ఎంతో అభిమానం అంటూ పరోక్షంగా ఈ విధంగా విమర్శలు చేస్తుండడంతో, ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో వైసీపీకి అంతుపట్టడం లేదు.ఒకవేళ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, మరింతగా విమర్శలు చేస్తారని ,బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని వైసిపి భావిస్తోంది.రఘురామకృష్ణంరాజు మాత్రంబీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వంటి వారి విషయాల్లోనూ తలదూర్చుతూ విమర్శలు చేస్తూ బీజేపీ ఆగ్రహానికి కూడా గురవుతుండటంతో, రాజుగారు ఏ ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది అందరికీ ప్రశ్నగా మారింది.