ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు.జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఏపీ క్యాబినెట్ ను ప్రక్షాళన చేయడం తో పాటు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లే విధంగా చేశారని, త్వరలోనే ముందస్తు ఎన్నికలకు సంబంధించి జగన్ ప్రకటన చేస్తారని అంత భావిస్తూ వచ్చారు.
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు, జనసేన వంటి పార్టీలు ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్లుగా హడావుడి చేస్తూ వస్తున్నాయి.అయితే తాజాగా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం పై జగన్ వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే లకు పార్టీ నాయకులకు ఒక క్లారిటీ వచ్చేసింది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జగన్ క్యాబినెట్ ప్రక్షాళన చేశారు.మంత్రులపై ఉన్న ప్రజావ్యతిరేకతను తగ్గించుకునేందుకు కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.ఇక ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా పోగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇదంతా ముందస్తు ఎన్నికల్లో భాగమేనని పార్టీ నాయకులతోపాటు అంతా భావించారు.
అయితే ఇటీవల నిర్వహించిన వైసీపీ వర్క్ షాప్ లో దీనిపై క్లారిటీ వచ్చేసింది.నిన్న జరిగిన వైసిపి గడపగడపకు ప్రభుత్వం వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.

రాబోయే ఎనిమిది నెలల పాటు గడపగడపకు ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్యేలు నాయకులకు జగన్ సూచించారు.వచ్చే ఆరు నెలల పాటు ఎమ్మెల్యేల పనితీరు పర్యవేక్షిస్తానని చెప్పారు .దీంతో జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచనను విరమించుకున్నారని అంతా అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం జగన్ ఢిల్లీకి వెళ్లారు .అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు .ఈ సందర్భంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.151 సీట్లతో భారీ మెజార్టీ సాధించి ఇంత ముందుగా ఎన్నికల కు వెళ్లడం సరైంది కాదని బీజేపీ పెద్దలు వారించడంతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అనే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.