వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.ముందు నుంచి చెబుతున్నట్లుగానే విశాఖ నుంచి పరిపాలనను సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇప్పటికే మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని గతంలో జగన్ ప్రకటించారు.అయితే కోర్టు ఇబ్బందులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్నారు.
దాని స్థానంలో మరింత పగడ్బందీగా , కోర్టు ఇబ్బందులు తలెత్తకుండా, మరో బిల్లును ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.వచ్చేనెల 14వ తేదీన ప్రారంభం కాబోయే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయబోతున్నామని, తాను అక్కడి నుంచి పరిపాలన చేయబోతున్నట్లు జగన్ ఇటీవల ప్రకటించారు.ఢిల్లీలో నిర్వహించిన గోబుల్ ఇన్వెస్ట్మెంట్ సమీట్ లోనూ ఇదే విషయాన్ని జగన్ ప్రకటించారు.చెప్పడమే కాదు ఇక విశాఖలో వారానికి రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు .మార్చి 22 నుంచి వారంలో రెండు రోజుల పాటు విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.ప్రతి సోమ , మంగళవారాల్లో జగన్ విశాఖలోనే బస చేయనున్నారు.అక్కడి నుంచి అధికారిక సమావేశాలు , సమీక్షలు కొనసాగించనున్నారు.ఈ మేరకు పోర్ట్ ట్రస్ట్ అతిథి గృహంలో జగన్ బస చేయబోతున్నట్లు సమాచారం.

ఈ మేరకు విశాఖపట్నం ట్రస్ట్ గెస్ట్ హౌస్ లో మార్పు చేర్పులు చేపడుతున్నట్లు సమాచారం.సోమ, మంగళవారాల్లో విశాఖలో ఉండబోతున్న జగన్ బుధవారం పల్లెనిద్రకు వెళ్తారు.అది ముగిసిన తర్వాత మళ్లీ తాడేపల్లి కార్యాలయానికి వెళ్తారు.
ఇప్పటికే విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ భవనాలను పరిపాలన కు అనుగుణంగా తీర్చిదిద్దాలని , గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి.భీమిలి రోడ్ లో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలు కూడా దీనికోసం వినియోగించబోతున్నారట.







