కొన్నాళ్ల క్రితం ట్విట్టర్‌ని కొని మంచి జోష్ లో వున్న ఎలాన్ మాస్క్ కి జాక్ డోర్సే మస్కా కొట్టనున్నాడా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.జాక్ డోర్సే… ఇపుడు సోషల్ మీడియాలో మంచి ఊపందుకున్న పేరు.
ఈ పేరు చాలా కొద్దిమంది మాత్రమే గుర్తుపెట్టుకున్నారు.అవును, ఇతను ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO.2021 నవంబర్‌లో జాక్ డోర్సే ట్విట్టర్ CEO పదవీ బాధ్యతల నుంచి వైదొలిగాడు.కొన్ని రోజుల తర్వాత బోర్డు నుంచి కూడా తప్పుకోవడంతో ట్విట్టర్ నుంచి పూర్తిగా అతగాడు దూరం అవ్వడంతో దాదాపు అతనిని అందరూ మర్చిపోయారు.

ఆ తర్వాత ఇన్నాళ్లకు ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా జాక్ డోర్సే కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారం తీసుకొస్తున్నారనే వార్తలు వెల్లువెత్తాయి.ఇకపోతే జాక్ డోర్సే కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాట్‌ఫారం పేరు బ్లూస్కై.ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులోనే ఉంది.అథెంటికేటెడ్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్‌పై ఆధారపడి ఇది ప్రస్తుతం పని చేస్తుంది.అంటే కేవలం ఒక సైట్ ద్వారా మాత్రమే కాకుండా పలు సైట్లు ద్వారా ఇది పనిచేయడం విశేషం.సోషల్ మీడియా వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని చేరేందుకు, సోషల్ మీడియా యూజర్లకు మంచి వేదికగా బ్లూస్కై నిలుస్తుందని డోర్సే ఓ పోస్టు పెట్టడం గమనార్హం.

బ్లూస్కై ఐఒయస్ యాప్ టెస్టింగ్ దశలో ఉండగా దీనిని సుమారు రెండు వేల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.కాగా పూర్తి స్థాయిలో త్వరలో అందుబాటులోకి రానుందని టాక్.బ్లూస్కైతో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తున్నట్లు డోర్సే తెలిపారు.బయటకు చెప్పకపోయినా ట్విటర్‌కు పోటీగానే దీన్ని తీసుకుస్తున్నారని టెక్ నిపుణులు గుసగుసలాడుకుంటున్నారు.ఇందులో ఒక్క క్లిక్‌తో 256 అక్షరాలతో పోస్టు పెట్టేయొచ్చు.దానికి ఫొటోలు కూడా జత చేయొచ్చు.
ఇష్టం లేని అకౌంట్లను మ్యూట్ లేదా బ్లాక్ కూడా చేయొచ్చు.అయితే ఇంకొన్ని అడ్వాన్స్ ఫీచర్లు అందుబాటులోకి రావాల్సి ఉంది.







