వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి పక్కలో బళ్లెంలా తయారయ్యారు.వైఎస్ఆర్ వీరాభిమానిగా తన మనవడికి సైతం ఆ పేరు పెట్టుకున్న రఘురామకృష్ణంరాజు జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఏకంగా సీబీఐతోనే తలపడ్డారు.
కానీ 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలిచిన ఏడాదిలోపే ఆయన వైసీపీలో రెబల్‌గా మారిపోయారు.గడిచిన రెండున్నరేళ్లుగా సీఎం జగన్ వర్సెస్ ఎంపీ రఘురామ అన్నట్లు పోరు కొనసాగుతోంది.
రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కారుతో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు.ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది.
ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి.అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.
రఘురామకృష్ణంరాజు నిత్యం పార్టీని ఇబ్బంది పెట్టే రీతిలో వ్యహరిస్తుండటంతో కొన్నాళ్లుగా వైసీపీ ఎంపీలు, ఆ పార్టీ అగ్రనేతలందరూ రఘురామపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై గతంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు వినతిపత్రం సమర్పించారు.
అయితే ఇప్పటివరకు లోక్‌సభ కార్యాలయం వైసీపీ ఎంపీల వినతికి స్పందించలేదు.

తాజాగా రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తాజాగా స్పందించింది.సీఎం జగన్‌పై, పార్టీపై ఆరోపణలు, విమర్శలు చేసినంత మాత్రాన ఎంపీపై అనర్హత వేటు కుదరదని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది.లోక్ సభలో పార్టీ విప్ ధిక్కరించిన వారిపైనే అనర్హత వేటు పడుతుందని, రఘురామ అలాంటిదేమీ చేయలేదు కాబట్టి ఇప్పుడున్న నిబంధన ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోలేమని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

స్పీకర్ కార్యాలయం ఇచ్చిన స్పష్టతతో రఘురామ ఇకపై రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే రఘురామను ఎదుర్కోవాలంటే వైసీపీకి ఒకే ఒక ఆప్షన్ ఉంది.ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడం. కానీ వైసీపీ అలా చేయలేదు.ఎందుకంటే ఆయన్ను బహిష్కరిస్తే ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఒకవేళ నర్సాపురంలో ఎన్నికలు వస్తే అధికార పార్టీకి ఎదురుగాలి వీయడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో వైసీపీ అంత ధైర్యం చేయదనే టాక్ వినిపిస్తుంది.
కాబట్టి రఘురామ ఇప్పటికైతే సేఫ్ జోన్‌లోనే ఉన్నారు.