యాదాద్రి జిల్లా:చౌటుప్పల్ అధికార పార్టీ కౌన్సిలర్ బొడిగే అరుణ బాలకృష్ణ అండదండలతో అతని బంధువు అక్రమ నిర్మాణానికి తెరలేపడంతో సమాచారం అంసుకున్న ఓ రిపోర్టర్ కవరేజ్ కి వెళ్లడంతో రిపోర్టర్ పై కౌన్సిలర్ బంధువు రాళ్ళతో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛపై అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించి పోతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమని జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి.
అధికార పార్టీ నేతల అవినీతి,అక్రమాలు,కబ్జాల గురించి వార్తలు రాస్తున్న విలేకర్లపై దాడులు చేయడం,బెదిరింపులకు దిగడం,పోలీసులతో అక్రమ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేయడమే పని పెట్టున్నట్లు కనిపిస్తుందని అన్నారు.మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్న గులాబీ కౌన్సిలర్ బంధువు బాగోతాన్ని రిపోర్టర్ తన మొబైల్ లో చిత్రీకరిస్తుండగా అతనిని దుర్భాషలాడుతూ,రాళ్లతో దాడి చేసి గాయపరిచిన ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ బంధువుపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు రావడంతో గతంలోనే మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణాన్ని ఆపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.అయినా కూడా అవేవీ పట్టించుకోని అధికార పార్టీ కౌన్సిలర్ బంధువు రాత్రివేళలో,సెలవు దినాలలో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందాయి.
ఈ క్రమంలో మంగళవారం మునిసిపల్ అధికారులు ఇంటి నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని నిర్మాణ పనులు ఆపేయాలని సూచించారు.ఇందుకు సంబంధించిన వార్తా కవరేజ్ కి వెళ్ళిన 99 టీవీ ఛానల్ రిపోర్టర్ రఫీఫై టీఆర్ఎస్ కౌన్సిలర్ బంధువు బూతులు తిడుతూ,రాయితో తలపై దాడి చేసే ప్రయత్నం చేయగా అతను తప్పించుకోవడంతో ప్రక్కటెముకకు బలమైన గాయం అయింది.
తనపై దాడి చేసిన కౌన్సిలర్ బందువుపై కేసు నమోదు చేయాలని రిపోర్టర్ రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చికిత్స కోసం రఫీని హైదరాబాద్ కు తరలించారు.
మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహా రెడ్డి: ఇంటి నిర్మాణం నిలిపివేయాలని గతంలోనే ఆదేశించాం.చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని సర్వే నెం.1లోని భూమిని ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించింది.ఇదే సర్వే నెంబర్ లో బొడిగె భాస్కర్ తన ఇంటి నిర్మాణం కోసం అనుమతులు కోరగా నిరాకరించడం జరిగింది.
అయినప్పటికీ మంగళవారం ఉదయం నిర్మాణం చేపడుతున్నారని సమాచారం అందడంతో మా సిబ్బందిని పంపించి నిర్మాణపనులను నిలిపివేయడం జరిగింది.
రిపోర్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:వైఎస్సార్ టిపి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రిపోర్టర్ పై జరిగిన దాడిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ తీవ్రంగా ఖండించారు.రిపోర్టర్లకు భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రిపోర్టర్ పై దాడి చేసిన టీఆర్ఎస్ కౌన్సిలర్ బంధువులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతహర్ డిమాండ్ చేశారు.