మహారాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి.అసెంబ్లీలో బలాబలాల నిరూపణకు రంగం సిద్ధమవుతోంది.
ఈ తరుణంలో గవర్నర్ పాత్ర కూడా కీలకం కానున్నది.గవర్నర్ చుట్టూ రాజకీయాలు తిరిగే అవకాశాలున్నట్టు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏక్‌నాథ్ షిండే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడకుండా రక్షణ లభించింది.జులై 12 వరకు వారిపై అనర్హత వేటు వేయకుండా డిప్యూటీ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది…
ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి షిండే వర్గం బలనిరూపణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
గౌహతి హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే ఈరోజు గవర్నర్ ను కలిసేందుకు ముంబయి వెళ్లనున్నట్టు రెబెల్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ తెలిపారు.ప్రభుత్వ ఏర్పాటుకు తాము బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సదా సర్వాంకర్ అన్నారు.
ఈ నేపథ్యంలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని షిండే వర్గం కోరే అవకాశం కనిపిస్తోంది.శివ సేన నుంచి బయటకు వచ్చిన తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బలనిరూపణకు అవకాశం ఇస్తే ముంబై తిరిగి వస్తామని గవర్నర్ ను షిండే కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య సవాల్ విసిరారు.రెబల్ ఎమ్మెల్యేలు ద్రోహులు అంటూ మండిపడ్డారు.ముంబయి నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు.తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాలంటూ ఆదిత్య ఠాక్రే సవాల్ విసిరారు.అసెంబ్లీలో బల పరీక్ష జరిగితే తామే గెలుస్తామని ఆదిత్య ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపైనా ఆదిత్య ఠాక్రే విమర్శలు చేశారు.మంగళవారం తమ ముందు హాజరు కావాలని రౌత్ ను ఈడీ ఆదేశించింది.అయితే, తనకు మరికొంత సమయం ఇవ్వాలని రౌత్ ఈడీని అభ్యర్థించారు.రౌత్ తరఫున ఈరోజు ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఆయన న్యాయవాది ఈమేరకు ఈడీ అధికారులకు లేఖ అందించారు.