తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) పరిస్థితి లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు.అవే అలుకలు, అవే గ్రూపు రాజకీయాలతో ఇబ్బందులు పడుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని చక్కదిద్దెందుకు ఎన్ని కమిటీలు నియమించినా, ఎంతమంది ఇన్చార్జిలను మార్చినా, పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.మరోవైపు చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది.
ఈ సమయంలోనూ పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ముఖ్యంగా పాత, కొత్త కాంగ్రెస్ గా నాయకులు విడిపోవడం వంటివి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ( Revanth Reddy )నియామకం అయిన దగ్గర నుంచి సీనియర్లంతా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.
తమకంటే బాగా జూనియర్ అయిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని మొదటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తూనే వచ్చారు.

ఇక రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సీనియర్లు చాలామంది దూరంగా ఉండటమే కాకుండా, బహిరంగంగాను రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు.ముఖ్యంగా సీనియర్ నాయకులు జానారెడ్డి, జగ్గారెడ్డి,( Jagga Reddy ) జీవన్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య , గీతారెడ్డి, దొంతి మాధవరెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు.

అలాగే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తంకుమార్ రెడ్డి వంటి వారు పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.గాంధీభవన్ కు అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లోనూ మొక్కుబడిగా హాజరవుతూ వస్తున్నారు .ఇటీవల రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ కొంతమంది నాయకులు పాల్గొనలేదు.దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోందనే ఆందోళన ఆ పార్టీ అధిష్టానం లో కనిపిస్తోంది.

వ్యవహారం ఈ విధంగా ఉండడంతో కార్యకర్తల్లోనూ తీవ్రమైన గందరగోళం నెలకొంది.రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నుంచి సీనియర్లంతా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు.సందర్భం వచ్చినప్పుడల్లా మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకే పార్టీ కార్యక్రమాలకు తాము దూరంగా ఉంటున్నామని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని పట్టించుకోవడం లేదన కొంతమంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.