దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన డిల్లీ లిక్కర్ స్కామ్ ( Delhi Liquor Scam )రోజుకో మలుపు తిరుగుతోంది.ముఖ్యంగా ఆప్ నేతలే టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరు హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే పలువురు ఆప్ నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే వారిలో డిల్లీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా( Manish Sisodia ) కూడా ఉన్నారు.ఇప్పుడు ఇదే కేసులో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేయడంతో ముందు రోజుల్లో ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇటీవల సిబిఐ సమన్లను ఎదుర్కొన్నా కేజ్రీవాల్ నిన్న విచారణకు హాజరయ్యారు.

9 గంటల పాటు దాదాపు 90 ప్రశ్నలను సిబిఐ కేజ్రీవాల్ కు సంధించిందట.అయితే సిబిఐ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ముందే చెప్పుకొచ్చారు కేజ్రీవాల్.అనవసరంగా కేవలం కక్ష పూరితంగానే డిల్లీ లిక్కర్ స్కామ్ ను తెరపైకి తెచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే మోడీ సర్కార్( Modi government ) ప్రయత్నిస్తోందని, ఇలాంటి చర్యలకు తాము బయపడేది లేదని విచారణకు ముందే కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
అయితే విచారణ ముగిసిన తరువాత అలాంటి పరిస్థితులేవి కనిపించలేదు.దాంతో మరోసారి కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాల్సిఉంటుందా ? అసలు కేజ్రీవాల్ విషయంలో దర్యాప్తు సంస్థలు ఏం చేయబోతున్నాయి అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.అయితే ఈ కేసులో కేజ్రీవాల్ ఒకవేళ అరెస్ట్ అయితే అది మోడీ సర్కార్ కు కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంది.

ఎందుకంటే దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మోడీ సర్కార్ పై కొంత విమర్శ ఉంది.దీనినే ప్రధాన అస్త్రంగా ఆప్ రాబోయే రోజుల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది.దానికి తోడు బిజేపీకి ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుండడంతో కేవలం కక్ష పూరితంగా కేజ్రీవాల్ పై దుశ్చర్యలకు మోడీ పాల్పడుతున్నారని దేశ ప్రజల్లో కేజ్రీవాల్ సానుభూతిని సంపాదించుకునే అవకాశం ఉంది.
ఇది ఆప్ కు మరింత మైలేజ్ తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.అందుకే కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో మోడీ సర్కార్ కొంత వెనుకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.మరి ఈ లిక్కర్ స్కామ్ చివరకు ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.







