ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో ఇప్పటి వరకు ఆ పార్టీపై ఆశలు పెట్టుకున్న టిడిపి పరిస్థితి గందరగోళంగా మారింది.ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చడం తనకు ఇష్టం లేదని, అన్ని పార్టీలను కలుపుకుని వైసిపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతో టిడిపిలో ఉత్సాహం కనిపించింది.
తమతో ఖచ్చితంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందని బలంగా నమ్మారు.అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది.
టిడిపి ,జనసేన పార్టీల మధ్య పొత్తు బెడిసి కొట్టడానికి ముఖ్యమంత్రి పదవే కారణం అని, ఎట్టి పరిస్థితుల్లోనూ తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటానని, ఈ మేరకు టిడిపి కూడా ప్రకటన చేయాలని డిమాండ్ విధించగా, టిడిపి శ్రేణులు మాత్రం చంద్రబాబుకి మాత్రమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అర్హత, అనుభవం ఉన్నాయని ప్రకటిస్తూ ఉండడం, ఇలా అనేక కారణాలతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టింది.ప్రస్తుతం ఏపీ లో 2024 ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి టీడీపీ కి ఏర్పడింది.
కమ్యూనిస్టు పార్టీలు మినహా టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు సిద్ధంగా లేకపోవడం, ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

2019 ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూసింది.మళ్లీ ఆ తరహా ఫలితాలు 2024 ఎన్నికల్లో వస్తే టిడిపి ఇక కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే భయం ఆ పార్టీ అధినేత చంద్రబాబులోనూ తీవ్రంగా కనిపిస్తోంది.అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది .ఈ మేరకు నియోజకవర్గాల్లో బలం పెంచుకునే విషయంపై దృష్టి పెట్టింది.పార్టీలో సంస్కరణలు చేపట్టాలని ముందుగా భావించినా.
ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకునే ఆలోచనలో ఉంది.ముఖ్యంగా మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి చెందిన వారిని తప్పించాలని , పార్టీలు పెద్దఎత్తున యువతకు ప్రాధాన్యం కల్పించి వారిని ఎన్నికల బరిలోకి దించాలని చూసినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రయత్నాలు చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరట.
ఏది ఏమైనా పవన్ పర్చూరులో చేసిన ప్రకటన టీడీపీ ని తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది.